ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ భాగమైపోయింది. అందులో వాట్సాప్ అనేది తప్పనిసరి అయిపోయింది. వాట్సాప్‌కు పోటీనిచ్చే టెలిగ్రామ్ కూడా ఇటీవల కాలంలో ప్రాముఖ్యతను సంపాదించుకుంది. రెండు ఉచిత ఇన్స్టంట్ మేసేజింగ్ సేవలను అందిస్తున్నాయి. ఒకటి వాట్సాప్ అమెరికాకు చెందిన సామాజిక మాధ్యమ కంపెనీ ఫేస్‌బుక్‌కు చెందినది. టెలిగ్రామ్ రష్యాకు చెందినవారు ప్రారంభించారు.
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌కు దాదాపు 150 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. టెలిగ్రామ్‌కు 50 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇవి రెండు ఎలాంటి ప్రకటనలు ఇవ్వవు. ప్రకటనలు ఉండకూడదన్న ఉద్దేశంతో వాట్సాప్‌ను మొదలు పెట్టారు ఆ యాప్ వ్యవస్థాపకులు. వాట్సాప్‌కు పోటీనివ్వాలన్న ఉద్దేశంతో రష్యన్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం వీకే వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో టెలిగ్రామ్ ప్రారంభమైంది. వాట్సాప్ కంటే పలు అదనపు ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఆదాయం ఎలా?
ప్రస్తుతానికి రెండు యాప్‌లకు ఎలాంటి ఆదాయం లేదు. ప్రకటనలు ఉండరాదన్న ఉద్దేశంతో ప్రారంభించిన దృష్ట్యా వినియోగదారులు భారీ సంఖ్యలో ఉన్నప్పటికీ ప్రకటనల వైపు ఆలోచన చేయలేదు. వాట్సాప్ కొన్ని రోజులు వార్షిక సబ్స్క్రిప్షన్ ఫీజుతో పెయిడ్ వర్షన్ కూడా తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతానికి అది లేదు. టెలిగ్రామ్.. వ్యవస్థాపకుల సొంత ఫండింగ్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే ఉద్యోగుల జీతం, ఇతర ఖర్చుల కోసం.. ఒక డాలరు వార్షిక ఫీజుతో యాప్‌ను తీసుకొచ్చింది. మొదటగా 2.5 లక్షల డాలర్లు మొదటి ఫండింగ్ పొందింది. రెండు, మూడో రౌండ్లో 6 కోట్ల డాలర్లు ఫండింగ్ పొందింది. 19 బిలియన్ డాలర్లకు వాట్సాప్‌ను 2014లో కొనుగోలు చేసిన ఫేస్బుక్.. వార్షిక ఛార్జీని తొలగించింది.
ఆదాయం లేకపోయినప్పటికీ వాట్సాప్ ఆ దిశగా ఉన్న అవకాశాలన్నీ ఉపయోగించుకుంది. ఇందులో 2018 జనవరిలో వాట్సాప్ బిజనెస్‌ను విడుదల చేసింది. ఇందులో వాట్సాప్ బిజినెస్ యాప్ చిన్న కంపెనీల కోసం తీసుకొచ్చింది. ఎంటర్ ప్రైజ్ సొల్యూషన్ పెద్ద కంపెనీల కోసం తీసుకొచ్చింది. వాట్సాప్ బిజినెస్‌లో చిన్న వ్యాపారులకు సంబంధించి ఆటోమేటిక్ రిప్లై, ఆర్డర్ స్టేటస్ తదితర టూల్స్‌ను పొందుపరిచింది.
యూపీఐ ఆధారిత పేమెంట్స్ సంబంధించిన సేవలను కూడా వాట్సాప్ పరిమిత స్థాయిలో ప్రారంభించింది. 2020 అక్టోబర్‌లో వాట్సాప్ బిజినెస్‌కు సంబంధించి ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
వాట్సాప్ ద్వారా రాబడి పెంచుకునేందుకు 2021 జనవరిలో కొత్త ప్రైవసీ పాలసీని ప్రకటించింది. ఈ పాలసీ ద్వారా వాట్సాప్ యూజర్ డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకునే వీలు ఉంది. కొత్త పాలసీ ప్రకారం తప్పకుండా కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించాల్సి ఉంది. దీనిపై విమర్శలు రావటంతో దీని అమలును వాయిదా వేసుకుంది.
వాట్సాప్ స్టేటస్‌లలో ప్రకటనలకు అవకాశం
ప్రకటనలు లేకుండా వాట్సాప్ అనుభూతి ఉండాలనుకున్నప్పటికీ.. మానిటైజేషన్ కోసం ప్రకటనలు ఇవ్వాలని ఫేస్బుక్ ప్రయత్నిస్తున్నట్లు పలు మీడియా కథనాలు వచ్చాయి. స్టేటస్ ద్వారా ప్రకటనలు రానున్నాయనేది వీటి సారాంశం. దీనిపై చర్చ జరిగినప్పటికీ.. ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు.
ఇదీ చూడండి: ఛార్జీలు లేవ్.. మరి జీపే, పేటీఎంకు ఆదాయం ఎలా?