కొత్తగా పెట్టుబడి ప్రారంభించే వారు సాధారణంగా యుక్త వయస్సులో ఉంటారు. ఉద్యోగ జీవితాన్ని కూడా అప్పుడప్పుడే ప్రారంభిస్తుంటారు. వీరికి సమయం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు ఆలోచించి ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. వాటికి అనుగుణంగా పెట్టుబడులు పెట్టాలి.
నెలవారీ ఖర్చులో 50/30/20 సూత్రం అనుసరించాలని నిపుణులు చెబుతుంటారు. 50 శాతం నిత్యావసరాలు, తప్పకుండా ఉండే ఖర్చులు కాగా.. 30 శాతం ఇష్ట పూర్వకంగా చేసే ఖర్చులు. ఈ 30 శాతంలో సినిమా, ఎంటర్టైన్మెంట్ తదితరాలు ఉంటాయి.
ఎంత పెట్టుబడి పెట్టాలి?
నెలవారీ ఆదాయంలో 20 శాతం పొదుపు, పెట్టుబడులు చేయాలనేది ఒక ప్రామాణిక సూత్రం. దీని ప్రకారం చూసుకున్నట్లయితే 30వేలు సంపాదించే వ్యక్తి 6వేల రూపాయలను పొదుపు, పెట్టుబడి చేయాలి. అయితే ఇందులో రుణ వాయిదా అనేవి ఉండవు.
మ్యూచువల్ ఫండ్స్
కొత్తగా పెట్టుబడులు ప్రారంభించాలనుకునే వారికి ఇది ఉత్తమ సాధనం. ఒకే సారి కొంత పెట్టుబడి పెట్టవచ్చు. అంతేకాకుండా సిప్ పద్ధతి ద్వారా నెలవారీగా కొంత మొత్తంలో పెట్టుబడి పెట్టొచ్చు.
ఇందులో పలు రకాల ఫండ్లు ఉంటాయి. డెట్ ఫండ్లు, ఈక్విటీ ఫండ్లుగా వీటిని విభజించవచ్చు. ఈక్విటీలో.. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్లలో రిస్కు ఎక్కువగా ఉంటుంది. అయితే వీటిలో రాబడి కూడా ఎక్కువగానే ఉంటుంది. సిప్ ద్వారా 100 రూపాయల నుంచి కూడా పెట్టుబడి ప్రారంభించుకోవచ్చు.
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ లాంటి వాటి ద్వారా పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు.
స్టాక్ మార్కెట్స్
వీటిలో పెట్టుబడులు ద్వారా ఎక్కువ రాబడి పొందవచ్చు. అయితే ఇందులో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. స్వల్ప కాలంలో నష్టాలున్నప్పటికీ దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయి. అవగాహనతో, లేదా ఆర్థిక సలహాదారును నియమించుకొని వీటిలో పెట్టుబడి చేయాలని నిపుణులు చెబుతున్నారు.
ఉదా: రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్‌లను తయారు చేసే ఐచర్ మోటార్స్ 2001లో ఒక్క షేర్ రూ. 17.50 వద్ద ఉంది. ఆ కాలంలో రూ.55వేలు పెట్టుబడి చేసినట్లయితే ఇప్పుడు ఆ పెట్టుబడి విలువ రూ. 4.75 కోట్లుగా ఉండేది.
బ్యాంకు డిపాజిట్లు
రిస్కు లేకుండా ఉండాలనుకునే వారికి ఈ పెట్టుబడి సరిపోతుంది. అయితే తక్కువ రిస్క్ ఉండే పెట్టుబడులు తక్కువ రాబడిని ఇస్తాయన్న నియమం వీటికి కూడా వర్తిస్తుంది. పొదుపు ఖాతాలతో పోల్చితే ఫిక్స్డ్ డిపాజిట్‌పై వడ్డీ రేట్లు కొంత ఎక్కువగా ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు ప్రస్తుతం 7 శాతం వరకు వార్షిక రాబడిని అందిస్తున్నాయి. సీనియర్ సిటిజెన్స్ విషయంలో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు సాధారణ పౌరుల వడ్డీ రేటు కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది.
ప్రభుత్వ పథకాలు
పెట్టుబడి పెట్టేందుకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ లాంటి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) అనేది చాలా పాపులర్ పెట్టుబడి పథకం. ఇది 7 నుంచి 9 శాతం రాబడిని ఇస్తుంది. లాక్ ఇన్ పీరియడ్ 15 సంవత్సరాలు.
ఈ పథకాల్లో త్వరగా మదింపు ప్రారంభించటం ద్వారా దీర్ఘకాలంలో మంచి కార్పస్ తయారు చేసుకోవచ్చు. అంతే కాకుండా పోస్టాఫీస్ లో కూడా పలు రకాల సేవింగ్స్ పథకాలు కూడా ఉన్నాయి.
ఇదీ చదవండి:ఏ వస్తువుకు ఎంత ధర? కంపెనీల ఇష్టమేనా?