కరోనా వల్ల నిర్మాణ రంగం స్తంభించిపోయింది. గృహాల నిర్మాణాలు వాయిదా పడటం లేదా ఆలస్యం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త ఇంటి కలలను సాకారం చేసుకునేందుకు కొనుగోలుదారులు ఆర్నెల్ల నుంచి రెండేళ్ల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థిరాస్తి అధ్యయన సంస్థ ఆన్రాక్ వెల్లడించింది.
హైదరాబాద్లో 2020 సంవత్సరంలో 30,500... 2021లో 14,700 గృహాల నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నట్లు ఆన్రాక్ తెలిపింది. దేశవ్యాప్తంగా చూస్తే 2020లో 4.66 లక్షలు, 2021లో 4.12 లక్షల ఇళ్ల నిర్మాణం జరగాల్సి ఉంది.
నిర్మాణ దశల్లో..
2013లో ప్రారంభించిన పలు ప్రాజెక్టులు చివరి దశ నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర స్థిరాస్తి నియంత్రణ ప్రాధికార సంస్థలు నిర్మాణ గడువును ఆరు నెలల వరకు సడలించాయి. పెట్టుబడి బాగున్న ప్రాజెక్టులకు సంబంధించి ఆరు నెలల కంటే ఎక్కువ సమయం వినియోగదారులు ఆగాల్సి ఉంటుంది. అదే మిగతా వాటికి మాత్రం రెండు సంవత్సరాల వరకు వేచి చూడాల్సి వస్తుంది.
నగరాల వారీగా...
2020లో దిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో లక్ష చొప్పున ఇళ్లు పూర్తి కావాల్సి ఉన్నాయి. తరువాతి స్థానాల్లో పుణె, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నైలు ఉన్నాయి. చెన్నైలో 24,650 ఇళ్లు పూర్తి కావాల్సి ఉన్నాయి.