కొత్త మొబైల్ కొన్నప్పుడు కొన్ని యాప్స్ ప్రీ-ఇన్‌స్టాల్డ్‌గా వస్తాయి. వాటిని బ్లాట్ వేర్ అని అంటారు. అలా వచ్చే వాటిలో ఫేస్‌బుక్ కూడా ఉంటుంది. కొన్ని మొబైల్స్‌లో అయితే ఇలాంటి వాటిని డిలీట్ చేయలేం. కొన్నింటిలో అయితే డిజేబుల్ మాత్రమే చేయగలం. అయితే ఈ మధ్య కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫేస్‌బుక్‌కు సంబంధించిన మూడు కొత్త యాప్‌లను ప్రీ-ఇన్‌స్టాల్డ్‌గా ఇస్తున్నారు. ఇవి మెనూలో పైకి కనిపించవు. కానీ సిస్టం సెట్టింగ్స్‌లో సెర్చ్‌లోకి వెళ్లి ఫేస్‌బుక్ అని టైప్ చేస్తే కనిపిస్తాయి.
ఫేస్‌బుక్ సర్వీసెస్, ఫేస్‌బుక్ యాప్ మేనేజర్ , ఫేస్‌బుక్ యాప్ ఇన్‌స్టాలర్ పేర్లతో మూడు యాప్స్ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉంటున్నాయి. ముందుగా వీటిని వన్‌ప్లస్ 8 సిరీస్, వన్‌ప్లస్ నోర్డ్, శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 సిరీస్ ఫోన్లలో గుర్తించారు. అయితే వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఇటీవల విడుదల చేసిన వన్‌ప్లస్ 8టీ ఫోన్లలో ఇవ్వలేదు. అయితే కొందరు వినియోగదారులు ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి ద్వారా యూజర్స్ ప్రమేయం లేకుండా ఫేస్‌బుక్ డేటా సేకరిస్తుందా అనే అనుమానాలు లేవనెత్తారు. దీంతో ఫేస్‌బుక్ దీనిపై వివరణ ఇచ్చింది.
అవి హిడెన్ యాప్స్ కావు: ఎఫ్‌బీ
వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా యాప్స్ ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ వెర్షన్స్‌ని విడుదల చేస్తుంటాయి. ఇవి కొన్ని ఫోన్లలో ఆటోమేటిగ్గా ఇన్‌స్టాల్ అయితే మరికొన్నింటిలో యూజర్ స్వయంగా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అయితే కొంతమంది యూజర్స్ వివిధ కారణాలతో కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ కావడం లేదట. దీంతో ఎన్నాళ్లయినా పాత వెర్షన్ యాప్సే వాడుతున్నారట. ఈ నేపథ్యంలో మొబైల్ సంస్థలతో కలసి ఫేస్‌బుక్ కొన్ని యాప్స్‌ని ప్రీ-ఇన్‌స్టాల్డ్ ఇస్తున్నట్లు తెలిపింది. ఇవి బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ యాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ, నోటిఫికేషన్స్ ఇస్తాయని ఫేస్‌బుక్ తన బ్లాగ్‌లో రాసుకొచ్చింది. అయితే అవి హిడెన్ యాప్స్ కావని, సెట్టింగ్స్‌లోకి వెళ్లి సిస్టం యాప్స్‌లో చూస్తే అవి కనిపిస్తాయని వెల్లడించింది. సిస్టమ్ యాప్స్‌కి యూజర్ ఇంటర్‌ఫేస్ ఉండదని.. అలానే యూజర్స్ అనుమానిస్తున్నట్లు ఇవి ఎలాంటి వ్యక్తిగత డేటా సేకరించవని ఫేస్‌బుక్ వెల్లడించింది. ఒకవేళ ఫేస్‌బుక్ ఉపయోగించనివారు ఈ యాప్‌ను డిజేబుల్ చేసుకోవచ్చని తెలిపింది.