దేశవ్యాప్తంగా జీఎస్‌టీ అమలుపై వివాదాలు ముసురుకుంటున్న తరుణంలో బుధవారం దిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ నేతృత్వంలో జరిగిన జీఎస్‌టీ మండలి 38వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పన్ను చెల్లింపుదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఎక్కడికక్కడే పరిష్కరించడానికి వీలుగా జోనల్, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే లాటరీలపై 28% పన్ను వసూలు చేయాలని తీర్మానించారు. దీర్ఘకాలిక లీజులపై చెల్లించే అప్‌ఫ్రంట్ అమౌంట్ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు పూర్తి మినహాయింపునివ్వాలని నిర్ణయించారు.
మండలి భేటీలో నిర్ణయాలు..
- జీఎస్‌టీ అమలులో ఎదురయ్యే ఇబ్బందులు, ఫిర్యాదుల పరిష్కారానికి జోనల్/రాష్ట్రస్థాయిల్లో ఫిర్యాదుల పరిష్కార కమిటీలు ఏర్పాటు చేయాలన్నది ప్రధాన నిర్ణయం. పన్ను చెల్లింపుదారుల నుంచి ఎదురవుతున్న సాధారణ ఫిర్యాదులను ఈ కమిటీలు జోనల్/రాష్ట్రస్థాయిలో పరిష్కరిస్తాయి.
- 2017-18 ఆర్థిక సంవత్సరానికి జీఎస్‌టీఆర్-9 ఫారంలో సమర్పించే వార్షిక రిటర్ను, ఫారం జీఎస్‌టీఆర్-9సీ రూపంలో సమర్పించే రీకన్సిలియేషన్ స్టేట్‌మెంట్ సమర్పణకు గడువును 2020 జనవరి 31వరకు పొడిగించారు. 2017 జులై నుంచి 2019 నవంబరు వరకు ఫారం జీఎస్‌టీఆర్-1 సమర్పించనివారు 2020 జనవరి 10లోపు సమర్పిస్తే జరిమానా ఉండదు. ఫారం జీఎస్‌టీఆర్-1ని 2017 జులై నుంచి (వరుసగా రెండు ట్యాక్స్ పీరియడ్లలో) సమర్పించని పన్ను చెల్లింపుదారులకు ఈ-వే బిల్లులు బ్లాక్ చేస్తారు.
- తప్పుడు ఇన్‌వాయిస్‌లను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకుంటారు. మోసపూరితంగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ అందుకున్న వాటిని బ్లాక్ చేస్తారు.
- ఫారం జీఎస్‌టీఆర్-3బి రిటర్నులు దాఖలు చేయని సందర్భంలో తీసుకోవాల్సిన చర్యలపై పన్ను అధికారులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ జారీ చేస్తారు.
- 2020 బడ్జెట్‌లో ప్రవేశపెట్టనున్న వివిధ చట్టసవరణలకు జీఎస్‌టీ కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 20% అంతకుమించి యాజమాన్య హక్కులున్న సంస్థలు పారిశ్రామిక, ఆర్థిక మౌలిక వసతుల కోసం దీర్ఘకాల లీజుకు తీసుకున్న ప్లాట్లపై చెల్లించాల్సిన అప్‌ఫ్రంట్ అమౌంట్‌ను పూర్తిగా మినహాయించారు. ఈ మార్పు 2020 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది.
- రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే/రాష్ట్ర ప్రభుత్వాల అధీకృతంలో నడిచే లాటరీలపై 28% జీఎస్‌టీ విధిస్తారు. ఈ కొత్త పన్ను 2020 మార్చి 1 నుంచి అమల్లోకి వస్తుంది.
- హెచ్‌ఎస్ 3923/6305 కిందికి వచ్చే చేతితో అల్లిన, అల్లని బ్యాగులు, పాలిథిలిన్ సాక్సులు, ప్యాకేజీ గూడ్స్ అన్నింటిపైనా జీఎస్‌టీ రేట్‌ను 18%కి పెంచారు. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది.
అనూహ్యంగా ఓటింగ్ నిర్వహణ
ఇంతవరకు జరిగిన అన్ని సమావేశాల్లోనూ ఏకగ్రీవంగానే నిర్ణయాలు తీసుకోగా, ఈ సారి లాటరీపై పన్ను విషయంలో అనూహ్యంగా ఓటింగ్ జరపాల్సి వచ్చింది. లాటరీలపై పన్ను పెంపును 21 రాష్ట్రాలు సమర్థించగా, ఏడు రాష్ట్రాలు వ్యతిరేకించాయి. లాటరీలపై ప్రస్తుతం రెండు రకాల జీఎస్టీ వసూలు చేస్తున్నారు. రాష్ట్రానికి చెందిన లాటరీలపై 12 శాతం, ఇతర రాష్ట్రాల లాటరీలపై 28 శాతం పన్ను వసూలు చేస్తుండడంతో ఒకే తరహా పన్ను కావాలని నిర్వాహకులు కోరుతూ వస్తున్నారు. దాంతో పన్నును 28 శాతంగా నిర్ణయించారు.
ఇదీ చూడండి: ట్రైబ్యునల్ తీర్పుపై మిస్త్రీ- టాటా స్పందన