బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసులో వజ్రాల వ్యాపారి, 49 ఏళ్ల నీరవ్ దీపక్ మోదీ(ఎన్డీఎం)కి లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్‌కు పంపిచకూడదంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని గురువారం నైరుతి లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది.
"పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించడానికి కుట్ర పన్నారన్న వ్యవహారంలో ఎన్డీఎంకి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నట్లు నమ్ముతున్నాం. ఆయన భారత్‌కు వెళ్లి అక్కడి కోర్టులకు సమాధానం చెప్పాల్సి ఉంది."
- జడ్జి శామ్యూల్ గూజీ, వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు
మోసం, నగదు అక్రమ చలామణీ జరిగాయనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని జడ్జి తెలిపారు. జైలులో ఉండటం వల్ల ఆయన మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నప్పటికీ, భారత్‌కు పంపించడానికి ఇది అడ్డంకి కాబోదని పేర్కొన్నారు. ఆయనను ముంబయి అక్బర్ రోడ్‌లోని సెంట్రల్ జైలులో ఉన్న 12వ నెంబర్ బ్యారెజ్‌కు పంపిస్తే ఆరోగ్యం కుదుటపడవచ్చని అభిప్రాయపడ్డారు. ఇందులో రాజకీయ జోక్యం ఉందంటూ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కేండేయ కట్జూ చేసిన వ్యాఖ్యాలను తిరస్కరించారు. ఈ తీర్పు కాపీని హోం మంత్రి ప్రీతి పటేల్‌కు పంపించనున్నారు.
'భారత్- బ్రిటన్ అపరాధుల అప్పగింత' ఒప్పందం ప్రకారం రెండు నెలల్లో మంత్రివర్గం దీనిపై నిర్ణయం తీసుకుంటుంది.
బ్రిటన్‌తో సంప్రదింపులు జరుపుతాం..
నీరవ్‌ను రప్పించే వ్యవహారంపై బ్రిటన్‌తో సంప్రదింపులు జరుపుతామని దిల్లీలో భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ తెలిపారు. ఇది మిగిలిన ఎగవేతదారులకు హెచ్చరికలాంటిదని సీబీఐ పేర్కొంది.
చాలా సమయం పడుతుంది..
లండన్ కోర్టు తీర్పు సానుకూల పరిణామమని సీబీఐ మాజీ డైరెక్టర్ ఏపీ సింగ్ వ్యాఖ్యానించారు. అయితే ఆయన వచ్చేందుకు చాలా సమయమే పడుతుందని తెలిపారు. ఆయన 'ఈటీవీ భారత్'తో మాట్లాడుతూ నీరవ్.. బ్రిటన్‌లో హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందని చెప్పారు. మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను కూడా భారత్‌కు అప్పగించాలని న్యాయస్థానం ఆదేశించినా వివిధ నిబంధనల కారణంగా ఇంతవరకు సాధ్యం కాలేదన్న విషయాన్ని గుర్తుచేశారు.
- ఇదీ చూడండి: 'రైతు శ్రేయస్సుకు కట్టుబడి ఉన్నాం'