ఎయిర్‌పోర్ట్‌లను ప్రైవేటుపరం చేసే ప్రక్రియను ప్రభుత్వం (Airports Privatisation) వేగవంతం చేసింది. ఇప్పటికే పలు ఎయిర్‌పోర్ట్‌లను ప్రైవేటు సంస్థలకు అప్పగించిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ).. ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్న ఇతర ఎయిర్‌పోర్ట్‌లలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ కేబినెట్ నోట్‌ను రూపొందించింది. తదుపరి కేబినెట్ భేటీలో.. ఎయిర్‌పోర్ట్‌లలో పెట్టుబడుల ఉపసంహరణకు ఎన్ఓసీ ఇచ్చే అంశంపై చర్చించే అవకాశముంది.
ఇందులో భాగంగా ప్రైవేటు సంస్థలతో కలిసి నడిపిస్తున్న నాలుగు ఎయిర్‌పోర్ట్‌లలో వాటాలను ఉపసంహరించుకోవాలని భావిస్తోంది కేంద్రం. హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ, ముంబయి ఎయిర్‌పోర్ట్‌లు వీటిలో ప్రధానంగా ఉన్నాయి.
హైదరాబాద్(AAI stake in Hyderabad Airport), బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లలో 13 శాతం వాటా (ఒక్కో ఎయిర్‌పోర్టులో).. దిల్లీ, ముంబయి ఎయిర్‌పోర్ట్‌లలో 26 శాతం చొప్పున వాటా ఏఏఐ వద్ద ఉన్నట్లు అంచనా.
మొదటి దశలో (Airports Privatisation First Phase)..
మొదటి దశలో హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లలో వాటాను ఉపసంహరించుకునే వీలుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయా ఎయిర్‌పోర్ట్‌లలో ప్రభుత్వా వాటా మదింపు, లావాదేవీని పూర్తి చేసేందుకు ఓ నిపుణుడిని నియమించుకునేందుకు ఏఏఐ ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
జాతీయ మానిటైజేషన్ ప్లాన్‌లో భాగంగా.. వచ్చే ఏడాది నాటికి 13 ఎయిర్‌పోర్ట్‌లను ప్రైవేటీకరించేందుకు ఏఏఐ ఇటీవలే ఆమోద ముద్ర వేసింది. ఎయిర్‌పోర్ట్‌లకు 2023-24 ఆర్థిక సంవత్సం నాటికి రూ.3,660 కోట్ల పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి: కెయిర్న్ వివాదంలో భారత్‌కు ఊరట- ఆస్తుల స్వాధీనంపై స్టే!