Refined Palm Oil: వంట నూనెల ధరలు అదుపు చేసేందుకు ప్రభుత్వం రిఫైన్డ్ పామాయిల్‌పై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని(బీసీడీ) 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది. 2022 మార్చి వరకు ఇది అమల్లో ఉంటుంది. ఈ చర్య వల్ల దేశీయ విపణిలో సరఫరా పెరిగి, ధరలు తగ్గుతాయని అంచనా. బీసీడీ తగ్గింపు వల్ల రిఫైన్డ్ పామాయిల్, రిఫైన్డ్ పామోలిన్‌లపై మొత్తం సుంకం 19.25 శాతం నుంచి 13.75 శాతానికి తగ్గనుందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఈఏ) పేర్కొంది. కొత్త రేటు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చింది. వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వశాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. సోమవారం కిలో వేరుసెనగ నూనె ధర రూ.181.48; ఆవాల నూనె రూ.187.43; వనస్పతి రూ.138.5; సోయాబీన్ నూనె రూ.150.78; పొద్దుతిరుగుడుపువ్వు నూనె రూ.163.18, పామాయిల్ రూ.129.94గా ఉన్నాయి. శుద్ధి చేసిన పామాయిల్‌ను లైసెన్సు లేకుండా 2022 డిసెంబరు వరకు దిగుమతి చేసుకోవచ్చని ప్రభుత్వం సోమవారం వెల్లడించింది.
కంది పప్పు, మినప్పప్పుల దిగుమతులకు పరిమితుల్లేవు:
కంది పప్పు, మినపప్పు, పెసరపప్పుల దిగుమతులను 2022 మార్చి 31 వరకు స్వేచ్ఛా విభాగం కింద చేసుకునేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ అనుమతించింది. వాస్తవానికి ఈ గడువు 2021 డిసెంబరు 31 వరకే ఉంది. వీటి దిగుమతులను పరిమితుల నుంచి స్వేచ్ఛా విభాగంలోకి మార్చడం వల్ల దేశీయంగా పప్పుదినుసుల సరఫరా పెరిగి, ధరలు అదుపులో ఉంటాయన్నది ప్రభుత్వ అంచనా. గిరాకీకి తగినట్లుగా దేశీయంగా దిగుబడి లేనందున భారత్ పప్పు ధాన్యాలను కొంతమేర దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా పప్పు దినుసుల వినియోగం 26 మిలియన్ టన్నులుండగా, 9.5మిలియన్ టన్నులు పండుతున్నాయని అంచనా.
ఇదీ చదవండి:
ఎలాన్ మస్క్ ఒక్క ఏడాదిలో అన్ని వేల కోట్ల పన్ను కట్టారా?
Disney Plus Hotstar: డిస్నీ+ హాట్‌స్టార్ కొత్త ప్లాన్.. రూ.49కే!