పూరీలు, బజ్జీలు వేయాలంటే ఎక్కువ నూనె అవసరం. వంట పూర్తయ్యాక ఆ నూనె అలానే ఉండిపోతుంది. మరోసారి వాడదామంటే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. రుచి కూడా తగ్గిపోతుంది. ఒకసారి వాడిన నూనెను పారబోయడం మినహా ఏమీ చేయలేం.
వాడేసిన వంట నూనెను పారబోయకుండా ఇంకేం చేయలేమా? ఈ ప్రశ్నకు జవాబు కోసం వెతికింది కేంద్రం. వ్యర్థం నుంచి బయోడీజిల్ తయారు చేసేందుకు సిద్ధమైంది.
దేశవ్యాప్తంగా కొత్త కార్యక్రమం....
దేశవ్యాప్తంగా 100 నగరాల్లో వాడిన వంట నూనెతో తయారు చేసిన బయోడీజిల్‌ను కొనుగోలు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎమ్‌సీ)... ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం శనివారం ప్రారంభించాయి. వాడిన వంట నూనె నుంచి బయోడీజిల్ ఉత్పత్తి కోసం ప్రైవేటు సంస్థలతో ప్లాంట్లు ఏర్పాటు చేయించే ప్రక్రియను త్వరలోనే మొదలుపెట్టనున్నాయి.
ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం పురస్కరించుకుని ఈ కొత్త విధానంపై దిల్లీలో ప్రకటన చేశాయి చమురు సంస్థలు.
అమలు ఇలా...
అమూల్ డైరీ... ఇళ్ల నుంచి పాలు సేకరించి, వాణిజ్య ఉత్పత్తులుగా మార్చిన తరహాలోనే బయోడీజిల్ కార్యక్రమం ఉంటుంది.
దేశంలో ఏటా 2700 కోట్ల లీటర్ల వంటనూనె వినియోగిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల నుంచి సుమారు 140 కోట్ల లీటర్ల నూనె సేకరణకు అవకాశముంది. దీని నుంచి ఏడాదికి 110 కోట్ల లీటర్ల బయోడీజిల్ ఉత్పత్తి చేయవచ్చు.
వాడిన వంట నూనె సేకరణ కోసం యూకో పేరిట ప్రత్యేక మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది కేంద్రం. వ్యర్థ నూనెను సరఫరా చేసే హోటళ్లు... కేంద్రం విడుదల చేసిన స్టిక్కర్లను తమ ప్రాంగణంలో అంటించుకోవాల్సి ఉంటుంది.
ప్రారంభంలో... బయోడీజల్ను లీటరుకు రూ.51 చొప్పున ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కొనుగోలు చేస్తాయి. రెండో ఏడాది నుంచి రూ.52.7, మూడో ఏడాది రూ.54.5 ఇస్తాయి.
ఇదీ చూడండి: హైదరాబాద్‌లో సందడి చేసిన నందిని రాయ్