ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్‌శాక్స్ ఈ ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటును స్వల్పంగా తగ్గించింది. సవరించిన అంచనాల ప్రకారం 2022 మార్చి 31 నాటికి భారత్ 11.1శాతం వృద్ధి సాధిస్తుందని పేర్కొంది. తాజాగా పలు రాష్ట్రాలు, నగరాలు లాక్‌డౌన్ కిందకు వెళుతుండటం వల్ల ఈ మేరకు అంచనాలను మార్చింది.
ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అత్యంత దారుణమైన కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికే దేశంలో కొవిడ్ మరణాలు 2.2లక్షలు దాటగా.. రోజువారీ కేసులు నాలుగు లక్షల వరకు ఉంటున్నాయి. కానీ, లాక్‌డౌన్‌కు మోదీ ప్రభుత్వం సానుకూలంగా లేదు. దానిని చివరి అస్త్రంగానే వాడాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొవిడ్ కట్టడి చర్యల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలపై వదిలేసింది.
లాక్‌డౌన్‌లు వచ్చినా.. గతేడాదితో పోలిస్తే తక్కువ తీవ్రతతోనే అమలయ్యే అవకాశాలు ఉన్నట్లు గోల్డ్‌మన్ అంచనావేస్తోంది. ఇప్పటి వరకు విధించిన ఆంక్షల తీవ్రతను .. గతేడాది ఆంక్షల తీవ్రతతో పోల్చిచూస్తే తక్కువగానే ఉన్నట్లు ఈ సంస్థ పేర్కొంది. కాకపోతే ఈ-వేబిల్లుల వినియోగం, రైళ్లలో సరకు రవాణ రద్దీ తగ్గడం, కార్గో ట్రాఫిక్ వంటివి పరిశీలిస్తే జీడీపీ అంచనాలు తగ్గుతాయని పేర్కొంది. ఈ మేరకు అంచనాలను 11.7శాతం వృద్ధి నుంచి 11.1శాతం వృద్ధికి తగ్గించింది. 2021 క్యాలెండర్ ఇయర్ ఆర్థిక వృద్ధి 10.5శాతం నుంచి తగ్గి 9.7శాతంగా ఉండొచ్చని అంచనా కట్టింది.
ఇప్పటికే నోమురా సంస్థ కూడా గత నెల దేశ ఆర్థిక వృద్ధిరేటును ఏప్రిల్2021-మార్చి 2022 సంవత్సరానికి 13.5శాతం నుంచి 12.6శాతానికి తగ్గించింది. జేపీ మోర్గాన్ సంస్థ ఇదే ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటును 13శాతం నుంచి 11శాతానికి తగ్గించింది. యూబీఎస్ సంస్థ 11.5శాతం నుంచి 10శాతానికి అంచానలను కుదించింది. సిటీగ్రూప్ కూడా 12శాతానికి అంచనాలను తగ్గించింది.
ఇదీ చూడండి: దేశవ్యాప్త లాక్‌డౌన్ అవసరం: పరిశ్రమ సంఘాలు