గత సంవత్సరం (2020) ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు 12.5 శాతం తగ్గాయని మార్కెట్ పరిశోధనా సంస్థ గార్ట్‌నర్ తాజా నివేదికలో వెల్లడించింది. అక్టోబర్- డిసెంబర్ త్రైమసికంలోనూ విక్రయాల్లో 5.4 శాతం క్షీణత నమోదైందని పేర్కొంది. ఆ త్రైమాసికంలో విక్రయాల పరంగా 20.8 శాతం మార్కెట్‌వాటాతో యాపిల్ అగ్రస్థానంలో, 16.2 శాతం వాటాతో శామ్‌సంగ్ రెండో స్థానంలో నిలిచాయి.
ఏడాదిక్రితంతో పోలిస్తే యాపిల్ మార్కెట్ వాటా 3 శాతానికి పైగా పెరగ్గా, శామ్‌సంగ్ వాటా 1 శాతం తగ్గింది. షియోమీ (11.3%), ఓపో (8.9%), హువావే (8.9%) సంస్థలు వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయని గార్ట్‌నర్ నివేదిక పేర్కొంది.
5జీ, చిన్న - మధ్య తరహా స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు పెరగడం వల్ల నాలుగో త్రైమాసికంలో కొంత మేర అమ్మకాల క్షీణతను పరిమితం చేశాయని గార్ట్‌నర్ సీనియర్ పరిశోధనా డైరెక్టర్ అన్షుల్ గుప్తా తెలిపారు. 'వినియోగదారులు ఖర్చులు తగ్గించుకుంటున్నారు. అవసరమైతేనే కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. అయితే 5జీ స్మార్ట్‌ఫోన్లు, మరిన్ని ప్రత్యేకతలతో కూడిన కెమెరా ఫోన్లు అందుబాటులోకి రావడం వల్ల కొనుగోళ్లకు ఉత్సుకత చూపుతున్నార'ని వివరించారు. అక్టోబర్- డిసెంబర్లో భారత విపణికి స్మార్ట్‌ఫోన్ల సరఫరా 2 శాతం మేర తగ్గిందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) తన నివేదికలో వెల్లడించిన విషయం విదితమే.
ఇదీ చదవండి:'గిగ్'తో ఉపాధి రంగంలో కొత్త శకం