మనుషుల ప్రాణాలతోనే కాదు.. మదుపర్ల సంపదతోనూ కరోనా వైరస్ చెలగాటమాడుతోంది. తన ఉనికిని ఊడలా మర్రిలా విస్తరించుకుంటూ పోతోంది. ఈ క్రమంలో దొరికిన సంపదనంతా దోచుకుంటోంది. అంతర్జాతీయంగా బుధవారం ఒక్కరోజే రూ.800లక్షల కోట్ల సంపదను ఆవిరి చేసిన ఈ మహమ్మారి తన ప్రతాపాన్ని ఇంకా ఉద్ధృతం చేస్తోంది.
వైరస్ ధాటికి ఆసియా మార్కెట్లు శుక్రవారం భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. సురక్షితంగా భావించే బంగారం, బాండ్ల షేర్లూ నేలచూపులు చూస్తున్నాయి. ఆస్ట్రేలియా మార్కెట్లు దాదాపు 7శాతం మేర కుంగాయి. న్యూజిలాండ్ సూచీలు చరిత్రలోనే అత్యధిక ఇంట్రాడే నష్టాల్ని నమోదు చేశాయి. జపాన్‌కు చెందిన నిక్కీ 10 శాతం, కొరియా కోస్డాక్ 8 శాతం పడిపోవడం వల్ల 20 నిమిషాల పాటు ట్రేడింగ్‌ను నిలిపివేశారు. అమెరికా మార్కెట్లు భారీ స్థాయిలో పతనం కావడం ఆసియా మార్కెట్లపై భారీ ప్రభావం చూపాయి.
అమెరికా డోజోన్స్ ఓ దశలో 10శాతం మేర నష్టపోయింది. 1987 నాటి బ్లాక్ మండే క్రాష్ తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. అమెరికా మార్కెట్లోకి 1.5 ట్రిలియన్ డాలర్లు చొప్పించనున్నామని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం వల్ల కాస్త కోలుకున్న మార్కెట్లు.. యూరప్ ప్రయాణాలపై ఆంక్షలు విధించడం వల్ల భారీగా పతనమయ్యాయి. ఎస్‌అండ్‌పీ 500 9.5శాతం పడిపోవడంతో కాసేపు ట్రేడింగ్‌ను నిలిపివేశారు.
ఇదీ చూడండి:పర్యటక రంగానికి రూ.8,500 కోట్ల నష్టం