National Hydrogen Policy: దేశంలో పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించుకుని గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా తయారు చేసే పాలసీని నోటిఫై చేస్తున్నట్లు కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్‌కేసింగ్ గురువారం తెలిపారు. గత ఏడాది ఆగస్టు 15న ప్రధానమంత్రి ప్రకటించిన నేషనల్ హైడ్రోజన్ మిషన్‌ను సాకారం చేసే విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు ప్రకటించారు. 2030 కల్లా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యం సాధించడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. "భవిష్యత్తులో శిలాజ ఇంధన స్థానాన్ని ఆక్రమించే ఇంధన వనరులు హైడ్రోజన్, అమ్మోనియాలే. పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించుకుని ఉత్పత్తి చేసేవాటిని గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా అంటాం. పర్యావరణ హిత ఇంధన భద్రతకు ఇవి ముఖ్యం" అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర పాలసీలోని ముఖ్యాంశాలు ఇవీ..
- గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా తయారీదారులు పునరుత్పాదక ఇంధనాన్ని పవర్ ఎక్స్ఛేంజీల ద్వారా, ఎక్కడినుంచైనా ఏ సంస్థ నుంచైనా కొనుగోలు చేయొచ్చు. లేదంటే వాళ్లే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. తాము ఉపయోగించని పునరుత్పాదక ఇంధనాన్ని 30 రోజులపాటు డిస్కంల వద్ద ఉంచుకోవచ్చు. అవసరమైనప్పుడు తీసుకోవచ్చు.
- దరఖాస్తు అందిన 15 రోజుల్లో ఓపెన్ యాక్సెస్ సౌకర్యాన్ని కల్పిస్తారు.
- రాష్ట్రాల పరిధిలోని గ్రీన్‌హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తిదారులకు డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీలు రాయితీ ధరలకు పునరుత్పాదక ఇంధనాన్ని సరఫరా చేయొచ్చు. అందులో సమీకరణ ఖర్చులు, వీలింగ్ ఛార్జీలు, రాష్ట్ర విద్యుత్తు కమిషన్లు నిర్ణయించిన మేరకు స్వల్పమార్జిన్ మాత్రమే చేర్చాలి.
- 2025 జూన్ 30లోపు గ్రీన్‌హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటుచేసేవారికి 25 ఏళ్లపాటు ఇంటర్‌స్టేట్ ట్రాన్స్‌మిషన్ ఛార్జీలు రద్దుచేస్తారు.
- గ్రీన్‌హైడ్రోజన్, అమ్మోనియా తయారీదారులు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్లాంట్‌కు వెంటనే గ్రిడ్ అనుసంధానం కల్పిస్తారు.
- పునరుత్పాదక ఇంధనం కొనుగోలు షరతు (రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్)ను అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనాలను హైడ్రోజన్, అమ్మోనియా తయారీదారులు, డిస్కంలకు ప్రోత్సాహకాల రూపంలో అందిస్తారు.
- సులభవాణ్యిం కోసం ఒకే పోర్టల్ ద్వారా అన్ని చట్టబద్ధమైన అనుమతులనూ నిర్దిష్ట గడువులోగా మంజూరుచేస్తారు. ఏ ఫిర్యాదు, సమస్యనైనా దీని ద్వారా చెప్పుకోవచ్చు.
- హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తికి అవసరమైన పునరుత్పాదక ఇంధన సరఫరా వ్యవస్థను వేగంగా ఇంటర్‌స్టేట్ ట్రాన్స్‌మిషన్ సిస్టంతో అనుసంధానిస్తారు.
- ఎగుమతులకు వీలుగా నౌకాశ్రయాల సమీపంలో అమ్మోనియా, హైడ్రోజన్ నిల్వచేసుకోవడానికి బంకర్లు నిర్మించుకోవడానికి అనుమతిస్తారు. ఇందుకు భూమిని నౌకాశ్రయ అధికారులే సమకూరుస్తారు.
ఇదీ చూడండి: 'బ్లూ హైడ్రోజన్ తయారీలో అగ్రస్థానమే లక్ష్యం'