కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా పర్యటన చేపట్టారు. అక్టోబర్ 11 నుంచి వారం పాటు అమెరికాలో జరిగే వివిధ సమావేశాల్లో అమె పాల్గొననున్నారు.
వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ వార్షిక సదస్సులు సహా.. జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, రిజర్వు బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశాలు ఈ వారం రోజుల్లో జరగనున్నాయి. వీటన్నింటిలో సీతారామన్ పాల్గొనున్నారు.
ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ వార్షిక సదస్సులు ప్రత్యక్షంగా జరగటం కరోనా సంక్షోభం తర్వాత ఇదే ప్రథమం. అయితే ఈ సారి కూడా వర్చువల్‌గా సమావేశంలో పాల్గొనేందుకు అవకాశం ఉంది.
ఈ పర్యటనలో భాగంగా సీతారామన్, అమెరికా ట్రెజరీ సెక్రెటరీ జెంట్ యెలెన్తో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. దీనితో పాటు.. పెట్టుబడిదారులు, ప్రైవేట్ ఈక్విటీ మదుపరులను ఉద్దేశించి సీతారామన్ ప్రసగించనున్నారు. వారందరినీ భారత వృద్ధి పథంలో భాగస్వాములవ్వాలని ఆహ్వానించనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అత్యధిక వృద్ధి రేటును సాధిస్తుందని భారత్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ ఏడాది ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో కూడా భారత్ 2021-22లో 11 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని అంచనా వేసింది.
భారత్ అమెరికా బంధం బలోపేతం!
ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో వివిధ అంశాలపై చర్చించారు. ఇప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా పర్యటన చేపట్టారు. ఆర్థిక పరమైన వివిధ అంశాలపై ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరిగే అవకాశాలున్నాయి.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ నవంబరులో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌తో, విదేశీ వ్యవహారాల మంత్రి టోనీ బ్లింకెన్‌తో వారు సమావేశమవనున్నారు. ఇలా వరుస పర్యటనలు, భేటీలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగయ్యే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: పెట్రో వాత.. వరుసగా ఏడో రోజూ పెరిగిన ఇంధన ధరలు