కరోనా వైరస్‌తో నెలకొన్న సంక్షోభంతో చాలా దేశాల ప్రజలు షాపింగ్ చేయాలంటే ఆచితూచి అడుగేస్తున్నారు. కానీ, చైనాలో మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఆన్‌లైన్‌లో రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేస్తున్నారు. తాజాగా జరిగిన ఆన్‌లైన్ షాపింగ్ ఈవెంట్‌లో దాదాపు రూ.5లక్షల కోట్ల (74బిలియన్ డాలర్లు) విలువైన అమ్మకాలు జరిగాయి. 'సింగిల్స్ డే' పేరుతో నిర్వహించే ఈ మెగా షాపింగ్ ఈవెంట్‌లో మునుపెన్నడూ లేనంతగా చైనీయులు షాపింగ్ చేసినట్లు వెల్లడైంది.
టీమాల్ సైట్ ద్వారా...
చైనాలో ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్‌నకు చెందిన 'టీమాల్' వెబ్‌సైట్ 2008 నుంచి ఆన్‌లైన్ అమ్మకాలను నిర్వహిస్తోంది. తాజాగా నవంబర్ 1 నుంచి 11వ తేదీ వరకు ప్రత్యేక డిస్కౌంట్‌లను ప్రకటించింది. ఈ సమయంలో టీమాల్ ద్వారా దాదాపు రూ.5లక్షల కోట్లు విలువైన అమ్మకాలు జరిగాయని చైనా మీడియా వెల్లడించింది. ఆ వెబ్‌సైట్ ప్రారంభమైన గత పన్నెండు సంవత్సరాల్లో ఇదే రికార్డుస్థాయి అమ్మకాలు అని పేర్కొంది. ఇక మరో సంస్థ జేడీ.కామ్ ద్వారా మరో రెండున్నర లక్షల కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయని చైనా మీడియా తెలిపింది.
ప్రతి ఏటా నిర్వహిస్తూ..
చైనాలో ఏటా నవంబర్ 11వ తేదీన మెగా ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. 11వ నెల, 11వ తేదీ కావడంతో 'సింగిల్స్ డే' పేరుతో దీన్ని (2009 సంవత్సరం నుంచి) నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో కంపెనీలు పలు ఆఫర్లు ప్రకటిస్తుండడంతో ప్రజలు కూడా భారీ స్థాయిలో కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇది కేవలం ఆన్‌లైన్ షాపింగ్ ఈవెంట్ కాకుండా, చైనా ఆర్థిక వ్యవస్థలో అతి ముఖ్యమైన అంతర్గత చెలామణి సమయమని అక్కడి ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇతర దేశాలపై ఎగుమతులపై ఆధారపడకుండా స్థానిక వినియోగాన్ని పెంచడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలను ఇది ఎత్తిచూపుతుందని అంటున్నారు.
396 కోట్ల పార్శిళ్లు..11 రోజుల్లో!
కేవలం నవంబర్ 11వ తేదీన ఒక్కరోజే అక్కడి స్థానిక పార్శిల్ సర్వీస్ సంస్థలన్నీ కలిసి దేశవ్యాప్తంగా దాదాపు 67కోట్ల పార్శిళ్లను చేరవేశాయని చైనా మీడియా తెలిపింది. ఈ 11 రోజుల్లో దాదాపు 396 కోట్ల పార్శిళ్లను చేరవేయడం గమనార్హం. ఇక 80కోట్ల వినియోగదారులు, 2,50,000 బ్రాండ్లు, 50లక్షల అమ్మకందారులు ఈ మెగా షాపింగ్ ఈవెంట్‌లో పాలుపంచుకున్నట్లు టీమాల్ వెల్లడించింది. నవంబర్ ఒకటి నుంచి 11వ తేదీ అర్థరాత్రి వరకు దాదాపు 232కోట్ల ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. అయితే, కేవలం షాపింగ్ కాకుండా, క్లౌడ్ కంప్యూటింగ్ పరిమితులు, డెలివరీ, చెల్లింపు సామర్థ్యాలను ఈ మెగా ఈవెంట్ ద్వారా అలీబాబా అంచనా వేస్తుంది.
ఇదీ చదవండి:26/11 దాడులను ఎట్టకేలకు అంగీకరించిన పాక్