కరోనా సంక్షోభం ఉద్యోగుల పాలిట పెనుశాపంగా మారింది. ఆర్థిక నష్టాల భయంతో కొన్ని కంపెనీలు ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తుంటే... మరికొన్ని సంస్థలు ఏకంగా ఉద్యోగులనే తొలగిస్తున్నాయి.
కరోనా సంక్షోభం, లాక్డౌన్ మొదలైనప్పటి నుంచే... అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగులపైనా ఆ ప్రభావం పడుతోంది. మరి ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కే మార్గమే లేదా?
ఉద్యోగాల్లో కోత
ఇటీవల ఫిక్కీ, ధ్రువ్ అడ్వైజర్స్ చేసిన ఇండస్ట్రీ సర్వే ప్రకారం... దాదాపు 32 శాతం కంపెనీలు 10 శాతం వరకు ఉద్యోగాల్లో కోత ఉండొచ్చని సంకేతాలిచ్చాయి. 14 శాతం కంపెనీలు... ఉద్యోగుల వేతనాల్లో 5 నుంచి 10 శాతం వరకు కోత పడినట్లు పేర్కొన్నాయి. 4 శాతం మంది ఉద్యోగులు 5 శాతం వరకు తమ వేతనాలు తగ్గినట్లు వెల్లడించారు.
మార్గముంది!
ఉద్యోగం కోల్పోవడం, ఆదాయం తగ్గిపోవడం లాంటి సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం క్రమశిక్షణతో కూడిన ఆర్థిక నిర్వహణ సూత్రాలను పాటించాలని సూచిస్తున్నారు. అవి ఏంటంటే...
ఖర్చులు తగ్గించుకోవాలి!
అనవసరమైన విలాస ఖర్చులను వీలైనంత వరకు తగ్గించుకోవాలి. కనీస అవసరాలకు మాత్రమే డబ్బును ఉపయోగించాలి. ఉద్యోగం పోయినా, వేతనాలు తగ్గినా.. ఖరీదైన అద్దె ఇంట్లో నుంచి తక్కువ అద్దె ఉండే ఇంటికి మారాలి.
వేరే రంగంలోనూ!
మీరున్న రంగంలోనే కాకుండా తాత్కాలికంగా వేరే రంగంలో కూడా ఉద్యోగం కోసం ప్రయత్నించవచ్చని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు సూచిస్తున్నారు.
పెట్టుబడులు వాయిదా!
స్టాక్మార్కెట్లో పెట్టుబడులు, సిప్ చేయడం లాంటివి తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. వేతనాల్లో స్థిరత్వం వచ్చే వరకు ఇది తప్పదని వారు స్పష్టం చేస్తున్నారు.
నెలవారీగా కట్టే ఈఎంఐలపై మారటోరియం తీసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఈ సమయానికి కూడా వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్న విషయాన్ని మరవకూడదు. అందువల్ల ఎక్కువ వడ్డీ ఉన్న రుణాలపై ఈఎంఐలు కట్టుకోవడం ఉత్తమం.
పొదుపు డబ్బులను వాడుకోవచ్చా?
ఆదాయం లేని పరిస్థితుల్లో కనీస అవసరాల కోసం అత్యవసర నిధిని కొద్దిగా వాడుకోవచ్చు. ఆ తరువాత తప్పని పరిస్థితుల్లో పొదుపును కూడా వాడుకోవచ్చు. మరీ తప్పకపోతే షార్ట్ టర్మ్ లిక్విడ్ ఫండ్లను వినియోగించవచ్చు. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులను మాత్రం ఉపసంహరించుకోవడం మంచిది కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ప్రావిడెంట్ ఫండ్ నుంచి కొంత మొత్తాన్ని తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశమిస్తోంది. అందువల్ల అత్యవసరాలకు.. పీపీఎఫ్, ఎన్పీఎఫ్ నుంచి కొద్ది మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు.
బంగారం అక్కరకు వస్తుంది...
ప్రస్తుతం బంగారం ధరలు చాలా ప్రియంగా ఉన్నాయి. మరోవైపు స్టాక్మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బంగారాన్ని ఉపయోగించుకోవచ్చని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
రుణం...
అన్ని ప్రత్యామ్నాయాలు మూసుకుపోతే... ఇక అప్పు చేయడం ఒక్కటే దారి. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ వడ్డీ ఉండే బీమా రుణాలు, బంగారం లేదా మ్యూచువల్ ఫండ్ రుణాలు తీసుకోవచ్చు. అయితే ఎక్కువ వడ్డీ రుణాలు, క్రెడిట్ కార్డు రుణాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి: ఇప్పుడు ఎస్బీఐ రుణాలు మరింత చౌకగా!