కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో పాటు టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, నిత్యావసర ఔషధాల సరఫరాను సక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వానికి పారిశ్రామిక సంఘాలు సూచిస్తున్నాయి. కరోనా రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోవడానికి ఒక జాతీయ విధానాన్ని అత్యవసరంగా ప్రవేశపెట్టాలని తద్వారా కరోనాయేతర క్రిటికల్ కేసులకు బెడ్‌లు ఇవ్వడానికి వీలవుతుందని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీకి ఫిక్కీ లేఖ రాసింది. ఇంకా జాతీయ స్థాయిలో కొన్ని రవాణా పరిమితులను విధించాలని తద్వారా పరీక్షా సదుపాయాలపై ఒత్తిడి తగ్గుతుందని తెలిపింది. రెమ్‌డెసివర్, టొసిలిజుమాబ్‌ల లభ్యతకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేట్టాలని ఫిక్కీ పేర్కొంది.
మరోవైపు దేశీయ ట్రేడర్ల సంఘమైన కెయిట్ తక్షణం దేశవ్యాప్త లాక్‌డౌన్‌తోనే పరిస్థితిని అదుపులో పెట్టగలమని అంటోంది. దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలను నిలిపేయడంతో పాటు పలు కఠినమైన చర్యలను తీసుకోవాలని మరో పారిశ్రామిక సంఘం సీఐఐ కోరింది. 'కొవిడ్-19పై విజయం సాధించామని దేశంలోని ప్రతి ఒక్కరూ చాలా ముందస్తుగా భావించడంతోనే ఇప్పుడు రెండో దశ విజృంభిస్తోంది. ఇప్పటికైనా నిత్యావసరేతర ఆర్థిక కార్యకలాపాలను తగ్గించేసి, ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉంది' అని సీఐఐ సూచించింది. భౌతికంగా కార్మికుల అవసరం ఉండి, నిత్యావసరేతర కార్యకలాపాలను నిర్వహించే కంపెనీలు వచ్చే రెండు వారాలు కార్యకలాపాలను నిలిపివేయాలని సూచించింది.
67.5 శాతం లాక్‌డౌన్‌కే
గతకొన్ని వారాలుగా దేశంలో కొవిడ్ విజృంభణ తీవ్రమైన నేపథ్యంలో తక్షణమే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ ఖాండేవాల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తిచేశారు. లాక్‌డౌన్ విధిస్తే గతేడాది చేసినట్లుగానే నిత్యావసర వస్తువులను ఎలాంటి ఆటంకం లేకుండా సరఫరా చేసేందుకు దేశవ్యాప్తంగా వ్యాపారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఒకవేళ దేశవ్యాప్తంగా పూర్తి లాక్‌డౌన్ సాధ్యంకాని పక్షంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లోనైనా పూర్తిగా లాక్‌డౌన్ విధించాలని కోరారు. ఇదే విషయమై 9వేల మందిపై జరిపిన సర్వేలో దాదాపు 78శాతం మంది కొవిడ్ తీవ్రత నియంత్రించలేని విధంగా ఉందని అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు. ఇక 67.5 శాతం మంది దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కే మద్దతు తెలిపినట్లు వెల్లడించారు.
దేశంలో లాక్‌డౌన్ విధిస్తే ఎక్కువగా నష్టపోయేది వ్యాపారులమేనని.. అయినప్పటికీ అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతున్న మహమ్మారిని అదుపులోకి తేవడం తక్షణ అవసరమని సీఏఐటీ సభ్యులు అభిప్రాయడ్డారు. ఒకవేళ దేశంలో లాక్‌డౌన్ విధించిన పక్షంలో తాత్కాలికంగా పన్ను మినహాయింపుతో పాటు ఈఎంఐల వసూలును వాయిదా వేసేలా బ్యాంకులకు ఆదేశాలివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
లాక్‌డౌన్‌కు పెరుగుతున్న మద్దతు..?
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంపై కేంద్ర, రాష్ట్రాలు పరిశీలించాలని భారత అత్యున్నత న్యాయస్థానం సూచించింది. దేశంలో వైరస్ కట్టడికి ప్రస్తుత చర్యలు సరిపోవడం లేదని.. లాక్‌డౌన్ ఒక్కటే మార్గమని ఈ మధ్యే ఎయిమ్స్ డైరెక్టర్‌తోపాటు ఇతర ఆరోగ్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు. కొందరు మాత్రం వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లోనే పూర్తి లాక్‌డౌన్ అమలు చేయాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కూడా భారత్‌లో కొద్ది వారాలపాటు లాక్‌డౌన్ అవసరమని అభిప్రాయపడ్డారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా మహమ్మారి పోరులో లాక్‌డౌన్ చివరి ఆయుధంగా వాడాలని పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ ఉద్ధృతితో కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. నిత్యం దాదాపు 4లక్షల కేసులు నమోదు కావడంతోపాటు 3వేలకు పైగా కొవిడ్ రోగులు మృత్యువాతపడుతున్నారు. దీంతో చాలా రాష్ట్రాలు ఇప్పటికే పాక్షిక లాక్‌డౌన్, కర్ఫ్యూ వంటి ఆంక్షలు అమలు చేస్తున్నాయి. దాదాపు పది రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగిస్తుండగా పలు రాష్ట్రాలు వాటిని ఎప్పటికప్పుడు పొడిగించేందుకే మొగ్గు చూపుతున్నాయి.
ఇదీ చదవండి : సంపూర్ణ లాక్‌డౌన్‌ను పరిశీలించండి: సుప్రీం