FDI in LIC: ఐపీఓకు దరఖాస్తు చేసుకున్న భారతీయ జీవిత బీమా సంస్థలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సంస్థలోకి 20 శాతం ఎఫ్‌డీఐలను నేరుగా అనుమతించాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. దీంతో ఎల్‌ఐసీ ఐపీఓలో విదేశీ పెట్టుబడిదారులూ పాల్గొనే వీలు కలుగుతుంది.
సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. ఎల్‌ఐసీ ఐపీఓలో పాల్గొనేందుకు విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఇప్పటికే దేశీయ బీమా రంగంలో 74% వరకు ఎఫ్‌డీఐకి నేరుగా అనుమతి ఉంది. కానీ ఈ నిబంధన ఎల్‌ఐసీకి వర్తించదు. పార్లమెంటులో చట్టం చేసి ఓ ప్రత్యేక సంస్థగా దీనిని ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం. ఇప్పుడు.. ఎల్‌ఐసీలోకి ఎఫ్‌డీఐ అనుమతించడంతో.. అతిపెద్ద విదేశీ పెన్షన్ ఫండ్‌లు, బీమా సంస్థలు దేశంలోనే అతి పెద్ద ఐపీఓగా భావిస్తున్న ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూలో పాల్గొనే వీలుంటుంది. దేశీయ సంస్థలో 10% అంతకంటే ఎక్కువ వాటాను కొనే విదేశీ వ్యక్తి లేదా సంస్థను ఎఫ్‌డీఐగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తిస్తుంది.
LIC Ipo Date: ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ కోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రభుత్వం ముసాయిదా పత్రాలను ఫిబ్రవరి 13న దాఖలు చేసింది. ఎల్‌ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్లకు పైగా రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్లను ప్రభుత్వం విక్రయించనుంది. రూ.63,000 కోట్ల వరకు ఖజానాకు చేరతాయని మర్చంట్ బ్యాంకర్ల అంచనా. తద్వారా ఇదే దేశీయంగా అతిపెద్ద ఇష్యూగా నిలవనుంది. ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో జరగనుంది. సంస్థలో 100 శాతం వాటా (632.49 కోట్ల షేర్లను) కలిగిన ప్రభుత్వం 5 శాతం వాటాను ఇలా విక్రయించబోతోంది. కొత్తగా షేర్లు ఏమీ జారీ చేయడం లేదు.
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఐదేళ్ల కాలానికి రూ.16 వందల కోట్ల నిధులను ఖర్చు చేసేందుకు అనుమతి ఇచ్చింది. పథకం కింద ప్రతి వ్యక్తికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతా నెంబర్‌ను అందజేస్తారు. ఆ హెల్త్ ఖాతాలో ఆ వ్యక్తికి సంబంధించిన డిజిటల్ హెల్త్ రికార్డులను నిక్షిప్తం చేస్తారు. వీటి ఆధారంగా వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది ఆ వ్యక్తికి ఉన్న అనారోగ్య సమస్యలను తెలుసుకొని దానికి అనుగుణంగా వేగంగా చికిత్స అందించేందుకు వీలు పడుతుందని ప్రభుత్వం గతంలోనే వెల్లడించింది.
ఇదీ చదవండి: కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ప్రేక్షకులు లేకుండానే 100వ టెస్టు