సామాజిక మాధ్యమ వేదికల్లో దిగ్గజ కంపెనీగా పేరొందిన ఫేస్‌బుక్.. త్వరలోనే తన పేరును(facebook name change) మార్చుకోనుందట. ఈ కంపెనీని కొత్త పేరుతో రీబ్రాండ్ చేయాలని ఫేస్‌బుక్ యాజమాన్యం యోచిస్తున్నట్లు ప్రముఖ టెక్ పత్రిక 'ది వెర్జ్' ఓ కథనంలో వెల్లడించింది. అక్టోబరు 28న జరిగే కంపెనీ వార్షిక సదస్సులో ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ పేరు మార్పు గురించి మాట్లాడే యోచనలో ఉన్నట్లు తెలిపింది. అయితే అంతకంటే ముందే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు పేర్కొంది.
ఫేస్‌బుక్(facebook name change) వ్యాపార కార్యాకలాపాలపై అమెరికా ప్రభుత్వం నుంచి న్యాయపరమైన ఇబ్బందులు పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీ పేరు మార్పుపై వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివాదాలు ఎదురైనప్పుడల్లా ఫేస్‌బుక్ పేరు(facebook name change) తరచూ వార్తల్లో రావడంతో అది యూజర్ల సంఖ్యపై విపరీతంగా ప్రభావం చూపిస్తోందని కంపెనీ విశ్వసిస్తోంది. దీంతో కంపెనీకి కొత్త పేరు పెట్టి కొంత ఉపశమనం పొందాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక, తమది కేవలం సోషల్ మీడియా మాత్రమే అనే అభిప్రాయాన్ని కూడా తొలగించుకోవాలని చూస్తున్నట్లు వెర్జ్ కథనం తెలిపింది.
అయితే పేరు మార్పు వల్ల ఫేస్‌బుక్ యూజర్లపై నేరుగా ఎలాంటి ప్రభావం ఉండదు. కంపెనీ మాతృ పేరును మార్చి.. దాని కిందకే ఫేస్‌బుక్ యాప్‌ను(facebook app) చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్‌కు చెందిన ఇతర యాప్‌లు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఒకులస్ కూడా ఈ పేరెంట్ కంపెనీ కిందకే తీసుకురానుంది. అయితే రీబ్రాండ్ వార్తలపై ఫేస్‌బుక్ ఇంకా స్పందించలేదు. అంతేగాక, రీబ్రాండ్ చేస్తే కంపెనీకి ఏ పేరు పెడతారనే దానిపై కూడా స్పష్టత లేదు.
కాగా.. సిలికాన్ వ్యాలీలో కంపెనీలకు పేర్లు మార్చడం కొత్తేమీ కాదు. సంస్థలు తమ సేవలను విస్తరించినప్పుడు బ్రాండ్ పేరును మార్చడం సాధారణమే. 2015లో గూగుల్.. ఆల్ఫాబెట్ కంపెనీని ఏర్పాటు చేసి దాన్నే మాతృక సంస్థగా చేసింది. ఇప్పుడు ఫేస్‌బుక్ కూడా మెటావెర్స్‌పై దృష్టి పెట్టింది. అందుకే రీబ్రాండ్ గురించి యోచిస్తున్నట్లు టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదీ చూడండి: 'మహారాజా'కు పునర్వైభవం వచ్చేనా?