"డిజిటల్ బ్యాంకింగ్ సేవలను మరింత విస్తృతం చేయడం ద్వారా సరికొత్త బ్యాంకింగ్ సేవల అనుభూతిని పంచడమే మా లక్ష్యం. ఖాతాదారులు మా బ్యాంకుపై ఉంచిన నమ్మకంతోనే బ్యాంకు ప్రస్తుత సంక్షోభ సమయంలోనూ మెరుగైన పనితీరును చూపించింది" అని అంటున్నారు యెస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ప్రశాంత్ కుమార్. సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటూ.. రాబోయే త్రైమాసికాల్లో నికర లాభాలను పెంచుకుంటామని చెబుతున్న ఆయనతో "ఈనాడు" ఇంటర్వ్యూ విశేషాలివి..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో యెస్ బ్యాంక్ ఫలితాలపై మీ స్పందన ఏమిటి? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
సెప్టెంబరు 30, 2020తో ముగిసిన రెండో త్రైమాసికానికి బ్యాంకు రూ.129.37 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఆపరేటింగ్ లాభం, ఫీజుల ఆదాయంలో బలమైన వృద్ధితో మేము సాధారణ స్థాయికి చేరుకున్నాం. మా డిపాజిట్లు 15.7 శాతం వృద్ధి చెంది, రూ.1,35,815 కోట్లకు చేరుకున్నాయి. ఇది వినియోగదారులు మా బ్యాంకుపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని సూచిస్తోంది. గత త్రైమాసికంలో రిటైల్, ఎంఎస్‌ఎంఈ విభాగాల్లో రూ.6000-6,500 కోట్ల వరకూ రుణాలను అందించాం. ప్రస్తుత త్రైమాసికంలో రూ.10,000 కోట్లు అందించాలనే లక్ష్యంతో ఉన్నాం. నిర్వహణ ఖర్చులను 21శాతానికి తగ్గించాం. 2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తానికి మా నిర్వహణ ఖర్చులను 20 శాతానికే పరిమితం చేయాలని అనుకుంటున్నాం.
బ్యాంకు పనితీరును మెరుగుపరచడానికి తీసుకున్న చర్యలు ఏమిటి?
నిర్వహణ ఖర్చులను మరింత తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాం. ఫీజులను హేతుబద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కార్పొరేట్ ఖాతాదారుల నుంచి వసూలు చేస్తున్న ఫీజులను తగ్గించాం. రిటైల్ ఖాతాదారులు, బ్యాంకింగ్ లావాదేవీల ఫీజులు కూడా సాధారణ స్థితికి వచ్చాయి. వీటిని మేము మరింత మెరుగుపర్చాలనుకుంటున్నాం. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.900 కోట్ల అప్పులను రికవరీ చేశాం. సమీప భవిష్యత్తులో రికవరీ రేటు మరింత పెరుగుతుంది. ఈ విషయంపై మా ఖాతాదారులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నాం.
బ్యాంకు పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది?
కొవిడ్-19 వల్ల భారత్‌తోపాటు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలపైనా తీవ్ర ప్రభావం పడింది. కొత్త సాధారణ ప్రపంచం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ఆర్థిక వ్యవస్థల వృద్ధి బాటలోనే మేమూ ప్రయాణిస్తామనే నమ్మకం ఉంది. లాక్‌డౌన్, ఆర్థిక మందగమనం ప్రభావం నుంచి బ్యాంకింగ్ రంగం వేగంగా కోలుకుంటోంది. రాబోయే త్రైమాసికాల్లో ఇది మరింత వృద్ధి చెందుతుంది. గత రెండు త్రైమాసికాల ఫలితాలను బట్టి చూస్తే.. యెస్ బ్యాంకు సరైన దిశలోనే ప్రయాణిస్తోందని నమ్మకంగా చెప్పగలను. ఆపరేటింగ్ లాభాల పరగంగా మెరుగైన పనితీరు చూపించబోతున్నాం.
యెస్ బ్యాంకు ఎక్కువగా కార్పొరేట్ రుణాలను ఇస్తుంటుంది కదా.. కొత్త యాజమాన్యం ఎంఎస్‌ఎంఈ, రిటైల్ రుణాలకు ప్రాధాన్యం ఇస్తోందా?
దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా రుణాల జారీలో స్థిరమైన వృద్ధిని సాధించాలని దృష్టి పెట్టాం. సెప్టెంబరు 2020లో 60వేల ఖాతాలు ప్రారంభించాం. మా సాంకేతిక బలాన్ని ఉపయోగించుకొని, నెలకు 1,00,000 ఖాతాలను ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నాం. వాహన, గృహ రుణాలతోపాటు, ఎంఎస్‌ఎంఈలకు దాదాపు రూ.10,000 కోట్ల అప్పులను ఇవ్వాలనే లక్ష్యాన్ని విధించుకున్నాం. రాబోయే రోజుల్లో రిటైల్, ఎంఎస్‌ఎంఈ రుణ ఖాతాలు ఇప్పుడున్న 45% నుంచి 60 శాతానికి పెంచాలనేది మా ప్రయత్నం.
కొత్త శాఖలు, ఏటీఎంలు, ఇతర సేవల విస్తరణ ఎలా ఉండబోతోంది?
డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో మా స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. ఇప్పటికే వాట్సాప్ బ్యాంకింగ్, ఎఫ్‌డీ హామీతో డిజిటల్ ఓవర్‌డ్రాఫ్ట్, సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ వంటి డిజిటల్ సేవలను అందిస్తున్నాం. 2020-21లో కొత్తగా ఎలాంటి శాఖలనూ ఏర్పాటు చేసే ఆలోచనలు లేవు. 2021-22లో విస్తరణకు ప్రణాళికలు ఉన్నాయి.
ఎన్‌పీఏల పరిస్థితి ఎలా ఉంది?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బ్యాంకు ప్రొవిజన్ కవరేజీ రేషియో (పీసీఆర్) కోసం 75.7% కేటాయింపులు చేసింది. స్థూల ఎన్‌పీఏలు 16.9% ఉండగా.. నికర ఎన్‌పీఏలు 4.71% ఉన్నాయి. సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులను అనుసరించి రూ.2,391 కోట్ల రుణాలను ఎన్‌పీఏలుగా పరిగణించలేదు. ప్రొవిజన్ కవరేజీ రేషియో (పీసీఆర్) 75.7శాతంగా ఉంది.
ప్రభుత్వ బ్యాంకర్‌గా ఉన్న మీరు.. ఒక ప్రైవేటు బ్యాంకుకు నాయకత్వం వహిస్తున్నారు.. మీ అనుభవాలు ఎలా ఉన్నాయి?
గత కొన్ని నెలలుగా ప్రతి ఒక్కరూ ఒక అనివార్యమైన మార్పును స్వాగతించాల్సిన పరిస్థితి. వ్యక్తిగతంగా నాకూ.. ఇది ఒక గుర్తింపునిచ్చే ప్రయాణమే. నేను సవాళ్లకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. యెస్ బ్యాంకును తిరిగి సానుకూల పరిస్థితుల్లోకి తీసుకురావడమే ప్రస్తుతం నాకున్న లక్ష్యం. ప్రస్తుత పరిస్థితుల్లోనూ బ్యాంకు చూపించిన ఫలితాలపై నేను సంతృప్తిగానే ఉన్నాను.
ఇదీ చూడండి: కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచనున్న ఆర్బీఐ!