పింఛన్‌దారుల జీవన ప్రమాణ పత్రం (లైఫ్ సర్టిఫికెట్) సమర్పణ తేదీని ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పొడగించింది. నవంబర్ 30 నుంచి 2021, ఫిబ్రవరి 28 వరకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో కరోనా వైరస్ వల్ల దరఖాస్తు చేయలేకపోయిన 35 లక్షల మందికి పైగా పింఛన్‌దారులకు లబ్ధి చేకూరనుంది. వీరందరికీ ఫిబ్రవరి వరకు ప్రతి నెలా ఫించను మంజూరు చేయనున్నారు.
'కరోనా వైరస్ మహమ్మారి వల్ల పెద్ద వయస్కులు ఇబ్బందిపడే అవకాశం ఉంది. అందుకే ఈపీఎఫ్‌వో పింఛన్‌దారుల జీవన ప్రమాణ పత్రం సమర్పణ తేదీని నవంబర్ 28 నుంచి 2021, ఫిబ్రవరి 28 వరకు పొడగిస్తున్నాం' అని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చర్యతో 35 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది.
ప్రస్తుతం జీవన ప్రమాణ పత్రాన్ని నవంబర్ 30లోపు ఎప్పుడైనా సమర్పించొచ్చు. దరఖాస్తు చేసిన తేదీ నుంచి ఏడాది వరకు ఇది వర్తిస్తుంది. తాజాగా ఆ గడువును ఫిబ్రవరి 28 వరకు పొడగించారు. సాధారణ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులు, ఫించన్లు ఇచ్చే బ్యాంకు శాఖల్లో జీవన ప్రమాణ పత్రాలను సమర్పించొచ్చు.
ఇదీ చూడండి:- ఇంటి నుంచే ఈపీఎఫ్ఓ జీవన ప్రమాణ పత్రం