సంఘటిత రంగాల్లో మేలో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారి సంఖ్య 3.18 లక్షలకు పెరిగింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పేరోల్ డేటా ద్వారా ఈ విషయం వెల్లడైంది. సంపూర్ణ లాక్డౌన్ కారణంగా ఏప్రిల్లో లక్ష ఉద్యోగాలు మాత్రమే నమోదైనట్లు ఈ డేటాలో తొలుత వెల్లడైంది. అయితే ఇటీవల చేసిన సవరణలతో ఏప్రిల్లో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారి సంఖ్య 1.33 లక్షలుగా తేలింది.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మార్చి చివరి వారం నుంచి లాక్డౌన్ అమలు చేసింది కేంద్రం. ఈ నేపథ్యంలో ఉద్యోగ అవకాశాలు ఏప్రిల్లో రికార్డు స్థాయిలో తగ్గిపోయాయి.
కరోనా విజృంభణకు ముందు మార్చిలో 5.72 లక్షలు, ఫిబ్రవరిలో 10.21 లక్షల మంది కొత్తగా ఉద్యోగాల్లో చేరడం గమనార్హం.
2019-20 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చిన వారి సంఖ్య 78.58 లక్షలకు పెరిగింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం(2018-19) ఈ సంఖ్య 61.12 లక్షలుగా ఉంది.
ఇదీ చూడండి:ఇకపై గ్రూప్ పాలసీగా కరోనా కవచ్