స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌పై ఈ వారం కంపెనీల త్రైమాసిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ప్రధానంగా ప్రభావం చూపనున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, అంతర్జాతీయ పరిణామాలూ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలేనని విశ్లేషకులు అంటున్నారు.
ద్రవ్యోల్బణం గణాంకాలు..
సోమవారం రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) గణాంకాలు విడుదల చేయనుంది కేంద్ర గణాంకాల కార్యాలయం. మంగళవారం టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) లెక్కలు వెల్లడి కానున్నాయి. వారం ప్రారంభంలోనే ఈ గణాంకాలు విడుదల కానున్న నేపథ్యంలో.. అవి మార్కెట్ల ట్రేడింగ్‌ను కీలకంగా ప్రభావితం చేయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ వారం ఫలితాలు..
టెక్ దిగ్గజాలు విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాలు ఈ వారమే ప్రకటించనున్నాయి. ఫెడరల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్‌లూ ఈ జాబితాలో ఉన్నాయి. ఆయా సంస్థలు ప్రకటించే గణాంకాలపై మదుపరులు ప్రధానంగా దృష్టి సారించొచ్చని స్టాక్ బ్రోకర్లు అభిప్రాయపడుతున్నారు.
లాక్డౌన్ కారణంగా చాలా సంస్థల ఆదాయాలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ఫలితాల ప్రకటన తర్వాత మార్కెట్లు కొంత ఆస్థిరతకు లోనవ్వొచ్చు అని అంచనా వేస్తున్నారు.
రూపాయి కదలికలు, ముడి చమురు ధరలు మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:కరోనాతో మారిన లెక్క- సర్కారీ కొలువే శ్రీరామ రక్ష!