కరోనా సంక్షోభంతో రెణ్నెల్ల కాలంలో ఆటోమొబైల్ రంగం ఎన్నడూలేని విధంగా నష్టాలను చవిచూసింది. కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం వల్ల పరిశ్రమలను తాత్కాలికంగా మూసివేశారు. ఫలితంగా మార్కెట్లోకి కొత్త ఉత్పత్తుల విడుదల వాయిదావేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అలానే రెండు సంవత్సరాలకొకసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆటోఎక్స్‌పో కూడా రద్దయింది. రెండో విడత లాక్‌డౌన్ సమయంలో పరిశ్రమలు పరిమిత సంఖ్య ఉద్యోగులతో కార్యకలాపాలు కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతించినప్పటికీ, ఉద్యోగులను కరోనా భయం వెంటాడినందున.. ఆశించినంతగా కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి రాలేదు. జూన్ 8 నుంచి ప్రభుత్వం పూర్తిస్థాయిలో షోరూమ్‌లు తెరుచుకునేందుకు అనుమతి లభించడం వల్ల.. తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసేందుకు తయారీదారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో విడుదల కానున్న కొత్త మోడల్ బైకులు ఏంటో ఒక్కసారి చూద్దామా...
ట్రయాంప్ బొన్నేవిల్లే టీ 100 బ్లాక్, టీ 120 బ్లాక్
![Trimph-Bonneville-110-12-bl](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7474806_trimph-bonneville-110-12-bl.jpg)
మోడ్రన్ క్లాసిక్ వాహన శ్రేణి విస్తరణలో భాగంగా ట్రయాంప్ బొన్నేవిల్లే టీ 100 బ్లాక్, టీ 120 బ్లాక్ అనే రెండు కొత్త తరం మోటార్‌సైకిళ్లను విడుదలచేయనుంది. సాధారణ టీ 100, టీ 120 మోడల్స్‌కు అదనపు ఆకర్షణగా ఈ బ్లాక్ ఎడిషన్ బైక్‌లను మార్కెట్లోకి తీసురానున్నారు. వీటిలో ఇంజిన్, బాడీ, ఎగ్జాస్ట్ పైప్, ఫ్యూయల్ ట్యాంక్, బంపర్లు వంటి భాగాలు పూర్తి నలుపు రంగులో ఉంటాయి. టీ 100 బ్లాక్ మోడల్‌లో 900సీసీ పార్లల్ ట్విన్, టీ 120 బ్లాక్ మోడల్‌లో 1200సీసీ పార్లల్ ట్విన్ ఇంజిన్లను అమర్చారు. వీటి ఎక్స్‌షోరూమ్ ధర రూ. 9 లక్షలు (టీ 100 బ్లాక్), రూ. 10 లక్షలు (టీ 120 బ్లాక్).
టీవీఎస్ విక్టర్
![TVS Victor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7474806_tvs-victor-bs6.jpg)
దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ ఇప్పటికే తన వాహన శ్రేణిలో అన్ని మోడల్స్‌ను బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ వస్తుంది. అందులో భాగంగా టీవీఎస్ విక్టర్ 110 మోడల్‌ను 110 సీసీ, బీఎస్-6, ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో మార్కెట్లోకి తీసుకురానుంది. వాటితో పాటు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, కొత్త రంగుల్లో ఈ బైక్‌ను విడుదలచేయనున్నారు. దీని ధర సుమారుగా రూ. 60,000 నుంచి రూ. 80,000 మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా.
కవాసకీ జెడ్900
![Kawasaki Z-900](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7474806_kawasaki-z900-bs6.jpg)
ప్రముఖ జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకీ జెడ్ 900 కొత్త తరం బైక్‌ను విడుదలకు రంగం సిద్ధం చేసుకుంది. బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా ఇంజిన్‌లో మార్పులు చేశారు. ఇందులో 948 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. ఇక ధర విషయానికొస్తే రూ. 8.5 లక్షలు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటోర్ 350
![Royalenfield-Meteor-350](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7474806_royalenfield-meteor-350.jpg)
రాయల్ ఎన్‌ఫీల్డ్ తన వాహన శ్రేణిలో మెటోర్ 350 పేరుతో సరికొత్త మోడల్‌ను విడుదలచేయనుంది. గతంలో ఉన్న థండర్‌బర్డ్ 350 మోడల్‌కి బదులుగా దీనిని తీసుకొస్తున్నారు. ఇందులో 350 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పాటు, కొత్తగా అభివృద్ధిచేసిన బాడీ ఫ్రేమ్, సింగిల్ ఓవర్‌హెడ్ కామ్‌ను ఉపయోగించారట. జూన్ చివర్లో దీని అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ధర సుమారుగా రూ. 1.70 లక్షలుగా నిర్ణయించినట్లు సమాచారం.
ట్రయాంప్ టైగర్ 900
![Triumph-tiger-900](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7474806_triumph-tiger-900.jpg)
సాహసవంతమైన ప్రయాణాలు ఎక్కువగా ఇష్టపడే వారికోసం బ్రిటన్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ ట్రయాంప్ టైగర్ 900 మోడల్ అడ్వెంచర్ బైక్‌ను విడుదలచేసేందుకు సిద్ధమయింది. గతంలో ఉన్న టైగర్ 800 మోడల్‌కు కొనసాగింపుగా ఈ బైక్‌ను తీసుకురానుంది. ఇంజిన్, డిజైన్, పనితీరు, వేగం ఇలా పూర్తిస్థాయి కొత్త హంగులతో ఈ బైక్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ తెలిపింది. దీని ధర సుమారు రూ. 16 లక్షల నుంచి రూ. 17 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.
హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్
![Hero Xtreme 160R](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7474806_hero-xtreme-160r.jpg)
160 సీసీ ఇంజిన్ శ్రేణిలో పోటీని తట్టుకునేందుకు ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటార్‌కార్ప్ త్వరలో హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ పేరుతో కొత్త మోడల్ బైక్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. దీని ధర సుమారుగా రూ. లక్ష వరకు ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా. హీరో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఈ మోడల్‌లో చెప్పుకోదగినవి 160 సీసీ ఇంజిన్, ఆకర్షణీయమైన బాడీ డిజైన్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ మోటార్. ఈ బైక్ 0- 60 కి.మీ వేగాన్ని కేవలం 4.7 సెకనల్లో చేరుకుంటుందట.
యమహా ఎఫ్‌జెడ్25
![Yamaha FZ-900](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7474806_yamahafz25-bs6.jpg)
యమహా సంస్థ ఎఫ్‌జెడ్ 25 మోడల్ బైక్‌ను బీఎస్-6 ప్రమాణాలతో మార్కెట్లోకి విడుదలచేయనుంది. ఆకర్షణీయమైన రంగులు, కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, సరికొత్త ఇనుస్ట్రుమెంట్ కన్సోల్, సైడ్ స్టాండ్ బటన్ వంటి కొత్త హంగులు ఇందులో ఉండనున్నాయి. ఈ మోడల్‌లో బీఎస్-6 250సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ధర మాత్రం బీఎస్-4 మోడల్ కంటే కొంచెం ఎక్కువే ఉంటుదని సమాచారం.
ఇదీ చదవండి: మాల్యా కథ మళ్లీ మొదటికి.. మెలిక పెట్టిన బ్రిటన్!