లాక్డౌన్ వేళ రేడియో శ్రోతల సంఖ్య పెరిగినట్లు తెలిపింది అసోషియేషన్ ఆఫ్ రేడియో ఆపరేటర్స్ ఫర్ ఇండియా(ఏఆర్ఓఐ). రేడియో వింటూ ప్రతిరోజూ 2.36 గంటలు అధికంగా గడుపుతున్నారని, రేడియోను అనుసరించేవారి సంఖ్య 23 శాతం పెరిగిందని తెలిపింది. ప్రస్తుతం ఇది టీవీ తర్వాత స్థానంలో ఉంది.
లాక్డౌన్ వల్ల విసుగును అధిగమించే ప్రయత్నంలో ఎక్కువ మంది ప్రజలు సమాచారం, వినోదం కోసం రేడియోను అనుసరిస్తున్నట్లు తెలిపింది ఏఆర్ఓఐ. టీవీని 56 మిలియన్లు, సోషల్ మీడియాను 57 మిలియన్ల మంది అనుసరిస్తుండగా... రేడియోను 51 మిలియన్ల మంది వింటున్నారని వెల్లడించింది.
"సాధారణ, రద్దీ సమయాల్లో రేడియో ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా అట్టడుగు స్థాయి నుంచి మెట్రో స్థాయి వరకు అందరూ ఆదరించే మాధ్యమం. "
-- ఏఆర్ఓఐ
సుమారు 3,300 మందిపై ఏజెడ్ నిర్వహించిన పరిశోధన ప్రకారం 82 శాతం మంది రేడియోను ట్యూన్ చేస్తున్నారు. ఈ కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో రెండో అత్యంత విశ్వసనీయ సమాచార వనరుగా ఎఫ్ఎమ్ ఛానెళ్లు అవతరించాయి. రేడియో విశ్వసనీయత 6.27 గా నమోదైంది. ఇంటర్నెట్ 6.44, టీవీ 5.74గా ఉన్నాయి. రేడియో ఎఫ్ఎమ్ వినేవారి సంఖ్య 64 శాతం నుంచి 22 శాతం పెరిగి 84 శాతానికి చేరుకుంది.
" రేడియో ద్వారా వచ్చే సమాచారాన్ని విశ్వసించేవారి సంఖ్య అధికంగా పెరుగుతోంది. విశ్వసనీయ సమాచార వనరుగా రేడియో అభివృద్ధి చెందడం మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఈ కరోనా సమయంలో రేడియోను అనుసరించేవారి సంఖ్య 23 శాతం పెరిగింది."
-- అనురాధ ప్రసాద్, ఏఆర్ఓఐ ప్రెసిడెంట్
ఇదీ చదవండి: వాట్సాప్లో ఈ కొత్త ఫీచర్ల గురించి తెలుసా?