నగదు రహిత కొవిడ్-19 చికిత్స క్లెయిములకు సంబంధించి తుది బిల్లు అందిన 60 నిమిషాల్లోపు నిర్ణయం తీసుకోవాలని బీమా సంస్థలను భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) గురువారం ఆదేశించింది. అలా వేగంగా నిర్ణయం తీసుకోవడం వల్ల ఆసుపత్రిలోని సంబంధిత పడక తదుపరి రోగికి త్వరగా అందుబాటులోకి వస్తుందని తెలిపింది.
కరోనా బారిన పడిన బాధితులకు ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్సకు సంబంధించి ఆసుపత్రి నుంచి అవసరమైన అన్ని పత్రాలతో అభ్యర్థన అందిన 60 నిమిషాల్లోపు ఏ విషయమూ తెలియజేయాలని అన్ని సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలకు సూచించింది. నగదు రహిత చికిత్సకు సంబంధించి అంగీకారాలను 30 నుంచి 60 నిమిషాల్లో తెలియజేయాల్సిందిగా బీమా సంస్థలకు సూచించాల్సిందిగా ఐఆర్‌డీఏఐను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. అలా చేయడం వల్ల కోలుకున్న బాధితులను ఆసుపత్రుల నుంచి ఇంటికి పంపడంలో ఆలస్యం ఉండదని హైకోర్టు అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలోనే ఐఆర్‌డీఏఐ నుంచి తాజా ఆదేశాలు వెలువడ్డాయి. మరోవైపు, తాజా సమయ నిబంధనలకు సంబంధించి బీమా సంస్థలు తమ టీపీఏలకు కూడా సమాచారాన్ని అందజేయాలని బీమా నియంత్రణ సంస్థ సూచించింది.
ఇవీ చదవండి: డెంగీ, మలేరియా చికిత్సలకు బీమా పాలసీలు
నెరవేరని 'ఒకే దేశం.. ఒకే పాలసీ' లక్ష్యం
మరింత పారదర్శకంగా క్లెయిమ్ సెటిల్మెంట్