స్థానిక చట్టాలకు లోబడి.. ప్రభుత్వాలతో పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్(google) సీఈఓ సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా ప్రభుత్వాలు ఏర్పరచే నియమ నిబంధనలను పాటిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆసియా పసిఫిక్ విలేకరుల వర్చువల్ సమావేశంలో వెల్లడించారు. కేంద్రం-వాట్సప్ మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
"ఆయా దేశాల్లో మా బృందాలు సేవల్లో నిమగ్నమై ఉన్నాయి. మేం పనిచేసే ప్రతి దేశంలోని స్థానిక చట్టాలను ఎల్లప్పుడూ గౌరవిస్తాం. ప్రభుత్వ అభ్యర్థనలకు అనుగుణంగా నివేదికల్లో పారదర్శకత పాటిస్తాం."
-సుందర్ పిచాయ్, గూగుల్ సీఈఓ
సాంకేతికత అనేది సమాజాన్ని విస్తృత మార్గాల్లో ప్రభావితం చేస్తోందని.. అంతేగాక సరికొత్త సాంకేతికత ఆవిర్భవిస్తోందని సుందర్ పిచాయ్ వివరించారు. శాసన ప్రక్రియను గూగుల్ గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
"సాంకేతికత.. సమాజంపై చూపిస్తున్న ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని.. నిబంధనలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ప్రభుత్వాలు ఆయా చట్టాలను అమలు చేస్తాయని ఆశిస్తున్నాం. ఐరోపాలోని కాపీరైట్ చట్టం, భారత్‌లో అమల్లోకి వచ్చిన సమాచార నియంత్రణ చట్టం ఏదైనా సరే.. సాంకేతికతపై ఆధారపడిన ప్రపంచంలో నిబంధనలను పాటించడం అనేది సహజంగా చేయాల్సిన ప్రక్రియలో భాగమే."
-సుందర్ పిచాయ్, గూగుల్ సీఈఓ
ఇవీ చదవండి: పిచాయ్‌పై కాశీలో కేసు- కొద్ది రోజుల్లోనే..