LPG Cylinder Price: కమర్షియల్ గ్యాస్ ధరను రూ. 105 మేర పెంచాయి చమురు సంస్థలు. దీంతో దిల్లీలో ప్రస్తుతం 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 2012కు చేరింది. సవరించిన ధరలు నేటి(మంగళవారం) నుంచే అమల్లోకి వచ్చాయని వాణిజ్య సంస్థలు తెలిపాయి.
5 కేజీ సిలిండర్ ధర రూ. 27 పెరిగింది. పెంచిన ధరతో దిల్లీలో 5 కేజీల సిలిండర్ రూ. 569కి చేరింది. ఇంట్లో వినియోగించే సాధారణ వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదని చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి.
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నెలనెలా సిలిండర్ల రేట్లను సవరిస్తుంటాయి చమురు సంస్థలు. అయితే.. గత నెలలో వాణిజ్య సిలిండర్ ధరను రూ.91 తగ్గించాయి. ఈసారి మాత్రం మరింత పెరిగింది.
ATF Fuel Price Hike: మరోవైపు విమాన ఇంధన (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్-ఏటీఎఫ్) ధరను కూడా 3.3 శాతం పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత సంస్థలు వెల్లడించాయి. దీంతో దిల్లీలో కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ. 3,010.87 పెరిగి రూ.93,530.66కి చేరింది.
ఏటీఎఫ్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం. ఈ ఏడాదిలో విమాన ఇంధన ధరలు పెరగడం ఇది ఐదోసారి.
ఇదీ చూడండి: 'కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గ్యాస్ ధర రూ.500కు మించదు'