ఎలక్ట్రిక్ కారు కొనాలంటే అంతా చూసేది బ్యాటరీ గురించే! ఛార్జింగ్ ఎంతొస్తుందనేది ఒకటైతే... బ్యాటరీ ఎన్నేళ్ళు నడుస్తుందనేది అన్నింటి కంటే కీలకం. ఇప్పుడా ఆలోచనకే తావు లేకుండా... నిశ్చింతగా ఎలక్ట్రిక్ కారు కొనేలా సరికొత్త ఆవిష్కరణతో ముందుకొస్తోంది చైనా! 1.24 మిలియన్ మైళ్ళు (సుమారు 20 లక్షల కిలోమీటర్లు) ... 16 సంవత్సరాల పాటు గ్యారెంటీగా నడిచే కారు బ్యాటరీ తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా సంస్థ కాంటెంపరరీ ఆంపెరెక్స్ టెక్నాలజీ లిమిటెడ్ (సీఏటీఎల్) ప్రకటించింది. టెస్లా, ఫోక్స్‌వాగన్ లాంటి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలకు ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలు తయారు చేసిచ్చే సీఏటీఎల్ - తాజా ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల రంగం వేగంగా దూసుకెళ్ళేందుకు దోహదపడుతుందనుకుంటున్నారు.
అమ్మకాలకు ఊతం..!
ప్రస్తుతమున్న ఎలక్ట్రిక్ కార్లలో బ్యాటరీలకు గరిష్ఠంగా లక్షా 50 వేల మైళ్ళు... 8 సంవత్సరాల వారెంటీ ఇస్తున్నారు. 'ఇప్పటిదాకా ఎలక్ట్రిక్ కార్ల రంగానికి బ్రేకులు వేస్తున్నది ఈ బ్యాటరీలే! త్వరత్వరగా బ్యాటరీలు డస్సిపోవటం; కొద్దికాలంలోనే కొత్తవాటిని అమర్చాల్సి వస్తుండటం ఈ రంగానికున్న ప్రధాన సమస్య. ఎలక్ట్రిక్ కార్లలోని భాగాల్లో ధరపరంగా ప్రియమైంది బ్యాటరీనే! అందుకే కీలకమైన ఈ బ్యాటరీ నాణ్యత పెరిగితే కార్ల అమ్మకాలు కూడా పుంజుకుంటాయన్నది నిపుణుల విశ్లేషణ. ఈ విషయాన్ని గుర్తించే టెస్లా, జనరల్ మోటార్స్ లాంటి సంస్థలు 10 లక్షల కి.మీ. మేర నిర్విరామంగా నడిచే బ్యాటరీల కోసం పరిశోధనలను ముమ్మరం చేశాయి. ఈలోపు చైనా కంపెనీ అంతకంటే రెండింతల సామర్థ్యంతో ముందుకొచ్చేసింది. 10 లక్షల కిలో మీటర్లంటేనే భూమిని 50సార్లు చుట్టిరావటంతో సమానం. అలాంటిది సీఏటీఎల్ సామర్థ్యం ప్రకారం చూస్తే... 100 సార్లు భూమిని చుట్టి వచ్చినా బ్యాటరీ బాగానే ఉంటుందన్న మాట! ఎవరైనా ఆర్డర్ ఇస్తే సరికొత్త భారీ బ్యాటరీని తయారు చేసి ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం' అని సీఏటీఎల్ ఛైర్మన్ జెంగ్ వెల్లడించారు.
ఇదీ చూడండి: ఆ చమురు సంస్థలో 10 వేల ఉద్యోగాలు కట్!