ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, టోకు, లాజిస్టిక్, గిడ్డంగుల వ్యాపారాన్ని కొనుగోలు చేయాలన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ రిలయన్స్ రిటైల్ ప్రతిపాదనకు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆమోద ముద్ర వేసింది. రూ. 24,173 కోట్ల ఈ ఒప్పందాన్ని ఇరు సంస్థలు గత ఆగస్టులో ప్రకటించాయి. ఈ ఒప్పందానికి అనుమతి ఇచ్చినట్లు శుక్రవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది సీసీఐ.
అమెజాన్ వ్యతిరేకించినా..
సీసీఐకి సమర్పించిన నోటీసు ప్రకారం.. మొత్తం ఏడు సంస్థలు ఒప్పందంలో ఉన్నాయి. అవి ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్, ఫ్యూచర్ కన్జూమర్, ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్, ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ మార్కెట్ నెట్‌వర్క్, ఫ్యూచర్ సప్లై చెయిన్ సొల్యూషన్స్, ఫ్యూచర్ బజార్, అనుబంధ కంపెనీలు. అయితే.. ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్‌ల మధ్య ఒప్పందాన్ని ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యతిరేకించింది. ఫ్యూచర్ కూపన్స్‌తో తమ కాంట్రాక్టు కారణంగా.. రిలయన్స్‌తో ఫ్యూచర్‌గ్రూప్ లావాదేవీ సబబు కాదంటూ సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీలకు అమెజాన్ లేఖలు రాసింది. సింగపూర్ ఆర్బిట్రేటర్ నుంచి అక్టోబరు 25న స్టే కూడా తెచ్చుకోవడం గమనార్హం.
ఇదీ చదవండి: 'ప్రజలకు రూ.600కే ఆక్స్ఫర్డ్ కరోనా టీకా'