CBI arrests Anand Subramanian: జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్‌ఈ) మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణ ఓ హిమాలయ యోగి ప్రభావానికి గురైన వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ అదృశ్య యోగి సలహాల మేరకు నడుచుకొని నిబంధనలకు విరుద్ధంగా ఆమె అప్పట్లో సీఓఓగా నియమించిన ఆనంద్ సుబ్రమణియన్‌ను సీబీఐ గురువారం రాత్రి అరెస్టు చేసింది. గతకొన్ని రోజులుగా ఆయన్ని చెన్నైలో విచారిస్తున్న అధికారులు గురువారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
సెబీ రిపోర్టులోని అంశాలపై విచారణ జరుపుతున్న సమయంలో వెలువడిన వాస్తవాల ఆధారంగానే సుబ్రమణియన్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు చిత్రా రామకృష్ణ, ఆనంద్ సుబ్రమణియన్ నివాస ప్రాంగణాలపై గత గురువారం ఆదాయ పన్ను(ఐటీ) విభాగం దాడులు చేసింది. ఈ ఇద్దరిపై ఉన్న పన్ను ఎగవేత, ఆర్థిక అవకతవకల ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలను పరిశీలించి సేకరించింది.
చిత్రా రామకృష్ణ తన వ్యక్తిగత, వృత్తి పరమైన నిర్ణయాల కోసం హిమాలయా పర్వతాల్లో ఉండే ఒక యోగిపై ఆధారపడేవారని ఇటీవల తమ తనిఖీల్లో తేలినట్లు సెబీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆనంద్ సుబ్రమణియన్‌ను నియమించడం వెనకా యోగి హస్తం ఉందని సెబీ పేర్కొంది. ఈ నియామకం విషయంలో పాలనా పరమైన అవకతకవలు జరిగాయని చెప్పింది.
2013 ఏప్రిల్ -2016 డిసెంబరు మధ్య ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈఓగా రామకృష్ణ వ్యవహరించారు. ఎన్‌ఎస్‌ఈకి సంబంధించిన ఆర్థిక, వ్యాపార ప్రణాళికలతో పాటు, డివిడెండు, ఆర్థిక ఫలితాల వంటి అంతర్గత సమాచారాన్ని రామకృష్ణ సదరు యోగితో పంచుకున్నారని సెబీ ఆదేశాలు వివరిస్తున్నాయి. ఎక్స్ఛేంజీలోని ఉద్యోగుల పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల విషయంలోనూ ఆ యోగిని ఆమె సంప్రదించారని తెలిపింది.
ఇదీ చూడండి: రిలయన్స్ స్థాయిలో మరో 30 కంపెనీలు: అంబానీ