దేశమంతా ఆక్సిజన్ వినియోగం పెరిగింది. కొవిడ్ రోగుల అవసరాలకు సరిపడా మెడికల్ ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో, గాలిలో నుంచి ఆక్సిజన్‌ను అందించే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల(ఓసీ)ను కొనుగోలు చేసి, ఇళ్లలో అమర్చుకునేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. కరోనా రోగులకు ఎటువంటి కాన్సన్‌ట్రేటర్ బాగుంటుందనే దానిపై ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసీఈఏ) కొన్ని సూచనలు చేసింది. ఈ సంఘంలో యాపిల్, ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, వివో, ఒపో, లావా వంటి సంస్థలున్నాయి.
ఐసీఈఏ ఛైర్మన్ పంకజ్ మొహింద్రో తెలిపిన వివరాలు ఇలా..
- కరోనా రోగులకు 90 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను నిమిషానికి 1-5 లీటర్ల మేర అందించే కాన్సన్‌ట్రేటర్ అవసరమవుతుంది. శ్వాససమస్య ఎక్కువగా ఉన్నవారికి 10 లీటర్ల కంటే అధిక సామర్థ్యం ఉన్నవి కావాలి.
- కాన్సన్‌ట్రేటర్ బరువు 15-19 కిలోలు ఉండాలి. కనీసం 5 లీటర్ల అవుట్‌పుట్ ఫ్లో ఉంటూ 90 శాతం ఆక్సిజన్ స్వచ్ఛత ఇచ్చే ఇలాంటివాటిని మేం సిఫారసు చేస్తున్నాం. ఇలా బరువుంటేనే ఆక్సిజన్ స్వచ్ఛత ఎక్కువగా ఉంటుంది.
- సీఓపీడీ రోగులకు చిన్న పాటి ఓసీలు(5-10 కిలోలు) సరిపోతాయి. కరోనా రోగులకు మాత్రం మధ్య స్థాయి(15-19 కిలోలు); పెద్ద స్థాయి(20 కిలోలు) ఓసీలు అవసరమవుతాయి.
చిన్న ఓసీలు 30 శాతం ఆక్సిజన్‌ను మాత్రమే ఇస్తాయి. అంటే కేవలం గాలి వీస్తున్నట్లు ఉంటుంది. అది కరోనా రోగుల అవసరాలను తీర్చదు. - మీరు కొన్న ఓసీపై 90-30 శాతం ఆక్సిజన్, నిమిషానికి 1 లీటరు లేదా నిమిషానికి 2 లీటర్లకు అని ఉంటే దానర్థం అంటే 1 లీటరు ఫ్లో లేదా 2 లీటర్ల ఫ్లో ఉన్నపుడు మాత్రమే 90 శాతం ఆక్సిజన్ ఉంటుందన్నమాట. అంతకంటే ఎక్కువ ఫ్లో ఉంటే 30 శాతానికి ఆక్సిజన్ పడిపోతుందన్నమాట.
- 20కిలోలు అంత కంటే ఎక్కువ సామర్థ్యం ఉండే ఓసీలు 1 లీటరు నుంచి 10 లీటర్ల ఫ్లో వరకు 90 శాతం ఆక్సిజన్‌ను అందిస్తాయి. ఇటువంటి వాటిని ఒకే మెషీన్‌పై ఇద్దరు రోగులకు కూడా అందించవచ్చు.
ఇవీ చదవండి: బజాజ్ హెల్త్ కేర్ నుంచి కరోనా ఔషధం