ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళిక ప్రకారం పెట్టుబడి పెట్టడం ఎంత ముఖ్యమో.... అనుకూలమైన సమయంలో పెట్టుబడిని ఉపసంహరించడం అంతే ముఖ్యం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడిని ఎలా ఉపసంహరించాలి అనే దానిపైనా దృష్టి సారించాలి. అప్పుడే మీ ఆర్థిక ప్రణాళిక పరిపూర్ణం అవుతుంది.
లక్ష్యానికి చేరువలో ముందు జాగ్రత్త
పోర్ట్‌ఫోలియోను నిర్మించడంలో మదుపరుల ముఖ్య ఉద్దేశం వారి ఆర్థిక లక్ష్యాలే. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే పెట్టుబడి ఉపసంహరణ చేయాలి. అలా చేస్తే మూల ధన రక్షణతో పాటు లక్ష్యం కూడా నెరవేరుతుంది.
దీర్ఘకాలం పాటు మదుపు చేసేవాళ్లు అనుకున్న లక్ష్యానికి కాస్త ముందు పెట్టుబడుల్లో కొంత ఉపసంహరించుకుని, స్థిర ఆదాయ పెట్టబడి సాధనాల్లో మదుపు చేయాలి. ఆ తర్వాత లక్ష్యానికి అవసరమైనప్పుడు వాటి నుంచి పూర్తిగా పెట్టుబడులను ఉపసంహరించుకోవాలి. ఇలా చేస్తే చివరి లక్ష్యానికి చేరువలో ఉన్నప్పుడు అనుకోని ఆటుపోట్ల నుంచి తప్పించుకోవచ్చు.
నష్టం అదుపులో ఉండాలంటే....
మదుపరి తన నష్టభయం, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోలో ఆస్తుల కేటాయింపులు చేసుకుంటారు. కొంతకాలం తరువాత ఆ కేటాయింపుల్లో మార్పుల కారణంగా నష్టభయం పెరిగే అవకాశం ఉంటుంది. ఈక్విటీల్లో ఉండే అధిక నష్ట భయాల నుంచి తప్పించుకునేందుకు డెట్ ఫండ్లు ఎంచుకుంటారు చాలా మంది. అయితే పెట్టుబడుల్లో ఈక్విటీలు, డెట్ పెట్టుబడులు సమానంగా ఉన్నప్పుడే నష్టభయం అదుపులో ఉంటుంది.
ఇందుకోసం ఈక్విటీల్లో పెట్టుబడులు పెరిగితే వాటిలో కొంత ఉపసంహరించుకుని డెట్‌లో పెట్టుబడి పెట్టాలి. డెట్‌లో పెట్టుబడి శాతం పెరిగిందనుకుంటే అందులో కొంత ఉపసంహరించుకుని ఈక్విటీల్లోకి మార్చుకోవాలి. ఇలా రెండింటినీ సమాంతరంగా నిర్వహించినప్పుడే నష్టాలు వచ్చినా అవి అదుపులో ఉండే అవకాశం ఉంది.
వ్యూహాత్మక ఉపసంహరణ
తాత్కాలికంగా పెట్టుబడి పెట్టేవాళ్లు, స్వల్పకాలికంగా బాగా పెరుగుతున్న ఈక్విటీలపై దృష్టి సారిస్తారు. అయితే స్వల్పకాలంలో పెరిగే షేర్లపై నిశితమైన పరిశీలన అవసరం. అందులో అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసుకున్న వెంటనే వ్యూహాత్మకంగా పెట్టుబడిని ఉపసంహరించుకోవాలి. అలా కాకుండా అనుకున్న లక్ష్యానికి చేరినా ఇంకా లాభపడతాయని ఎదురుచూస్తూ ఉండటం మంచిది కాదు. మార్కెట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో అంచనా వేయడం సులభం కాదు. లాభాలను స్వీకరించకుండా ఎదురుచూడటం వల్ల లాభం పొందాల్సిన సమయంలో నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
నష్టాలొస్తాయని తెలిస్తే....
పెట్టుబడి పెట్టేముందు అనేక విధాలుగా ఆలోచించే మదుపర్లు అనంతరం వాటిని పరిశీలించడంపైనా శ్రద్ధ పెట్టాలి. దీర్ఘ కాలంలో పెట్టుబడులు మంచివే అయినా... అవి లాభాలు గడించకపోతే బయటపడటం మేలు. లేదంటే మీరు అనుకున్న లక్ష్యం మరింత ఆలస్యం అవ్వడం సహా.. నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది.
అంతగా రాణించని పెట్టుబడి మూలంగా నష్టం జరుగుతున్నా విక్రయించకుండా వేచి చూడడం మంచిది కాదు.
నష్టాలకు పన్ను మినహాయింపు ఉందని మర్చిపోవద్దు
పెట్టుబడి ఉపసంహరణ అనేది చాలా కీలకమైన విషయం. ఇందుకు ఒక విధానం ఏర్పాటుచేసుకోవాలి. పెట్టుబడి లాభాల్లో ఉండేటప్పుడు విక్రయించడం ద్వారా భవిష్యత్తులో తక్కువ ధరకు విక్రయించి నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడదు.
పన్ను విషయంలోనూ శ్రద్ధ వహించాలి. ఆదాయ పన్ను చట్టం ప్రకారం పెట్టుబడిలో వచ్చే నష్టాలకు మినహాయింపు పొందవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఇదీ చూడండి: మహిళలకు ఉచిత ప్రయాణంపై 'మెట్రోమ్యాన్' గరం