Bank Deposit charges: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు(ఐపీపీబీ).. తమ ఖాతాదారులకు ఝలక్ ఇచ్చింది. వచ్చే ఏడాది నుంచి నగదు డిపాజిట్ చేసినా.. విత్ డ్రా చేసినా రుసుము చెల్లించాలి. ఈ మేరకు నిబంధనలను సవరించింది ఐపీపీబీ. ఈ బ్యాంకు.. ఖాతాదారులకు ఇచ్చిన పరిమితి వరకు నగదు లావాదేవీలు చేసుకోవచ్చు. ఆ పరిమితి దాటితో రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్స్ 2022 జనవరి 1న అమల్లోకి రానున్నాయి.
ఐపీపీబీ.. పలు ప్రయోజనాలతో మూడు రకాల పొదుపు ఖాతాలను (సేవింగ్ అకౌంట్స్) వినియోగదారులకు అందిస్తోంది. వేర్వేరు ఖాతాలు ఉన్నవారికి పరిమితులు కూడా వేర్వేరుగానే ఉంటాయి. ఆ వివరాలు ఇలా..
IPPB Basic Savings Account
ఐపీపీబీలో బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు ఎంత మొత్తమైనా.. ఎన్ని దఫాలైనా.. ఉచితంగా డిపాజిట్ చేయవచ్చు. అయితే నెలకు నాలుగు సార్లు మాత్రమే నగదు ఉచితంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత చేసిన ప్రతి లావాదేవీకి రుసుము చెల్లించాలి. డ్రా చేయాలనుకున్న మొత్తంలో 0.50 శాతం లేదా కనీసం రూ.25 బ్యాంకు వసూలు చేస్తుంది.
IPPB Savings and Current accounts
ఇతర సేవింగ్స్(బేసిక్ సేవింగ్స్ అకౌంట్స్ కాకుండా), కరెంట్ అకౌంటుల్లో నెలకు రూ.10,000 వరకు నగదు ఉచితం డిపాజిట్ చేయవచ్చు. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి 0.50 శాతం లేదా కనీసం రూ.25 ఛార్జీ చెల్లించాలి.
ఈ ఖాతాల నుంచి నెలకు రూ.25,000 వరకు నగదు ఉచితంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆ పరిమితి దాటి విత్‌డ్రా చేయాలనుకునే ప్రతి లావాదేవీకి 0.50 శాతం లేదా కనీసం రూ.25 ఛార్జీ చెల్లించాలి. ఈ ఛార్జీలపై జీఎస్టీ లేదా సెస్ ఉంటుందని ఐపీపీబీ తెలిపింది.
అంతకుముందు.. ఐపీపీబీ 2021 ఆగస్టు 1న డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలను సవరించింది. వినియోగదారుల నుంచి ప్రతి రిక్వెస్ట్‌కు రూ.20 చొప్పున రుసుము వసూలు చేస్తోంది.
ఇదీ చూడండి: '2022లో స్థిరాస్తి, బ్యాంకులు రాణిస్తాయ్'