బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. పసిడి ధర నానాటికీ పెరుగుతున్న తరుణంలో చాలా మంది బంగారం రూపంలో మదుపు చేస్తున్నారు. అందులోనూ ప్రస్తుతం ఆభరణాలు కాదని నాణేలవైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి.
మొదటిది.. వీటిని భవష్యత్తులో పిల్లల పెళ్లిళ్లు, ఇతర వాటికి వినియోగించుకోవచ్చు.
రెండోది.. తక్కువ పరిమాణంలోనూ కొనుగోలు చేయొచ్చు. 0.5 గ్రాముల్లోనూ లభిస్తుంది.
మూడోది.. తక్కువ తయారీ ఛార్జీలతో స్వచ్ఛమైన బంగారం లభిస్తుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి...
బంగారు నాణేలు కొనుగోలు చేసేందుకు తగు జాగ్రత్తలు పాటించాలి. స్వచ్ఛమైన బంగారం పొందాలంటే పరిగణించాల్సిన కొన్ని అంశాలు..
1.హాల్ మార్కింగ్
హాల్‌మార్క్ ఉన్న బంగారు నాణేలు కొనుగోలు చేయాలి. బంగారం కొనుగోలు చేసే వినియోగదారుడు మోసపోకుండా భారత ప్రభుత్వం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)ను ఏర్పాటు చేసింది. బంగారం, వెండి నాణేలు, ఆభరణాల్లోని స్వచ్ఛత స్థాయిని ఇది ధ్రువీకరిస్తుంది. బీఐఎస్ లోగో, స్వచ్ఛత, స్వర్ణకారుడి గుర్తింపు నంబర్, లోగో, హాల్‌మార్కింగ్ కేంద్రం వంటి వివరాలను ముద్రిస్తుంది. మీరు కొనుగోలు చేసిన బంగారు నాణెం బీఐఎస్ హాల్‌మార్క్‌ను కలిగి ఉన్నట్లైతే.. దానికి మరింత ప్రాముఖ్యం ఉంటుంది. ఏదైనా ఫిర్యాదు ఉంటే బీఐఎస్‌లో నేరుగా సంప్రదించవచ్చు.
బంగారు ఆభరణాలకు బీఐఎస్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదనకు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ ఏడాది అక్టోబర్‌లో ఆమోదం తెలిపింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ఆదేశాల అనంతరం తుది రూపు దిద్దుకోనుంది.
2.స్వచ్ఛత..
బంగారం స్వచ్ఛతను రెండు రకాలుగా లెక్కిస్తారు. ఒకటి క్యారెట్లలో, మరోటి ఫైన్నెన్స్.
సాధారణంగా స్వచ్ఛతను తెలుసుకునేందుకు చాలా మంది ఉపయోగించే విధానం క్యారెట్. 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. కానీ ప్రస్తుతం మనం కొనుగోలు చేసే బంగారు ఆభరణాలు 22 క్యారెట్లవి. 22 క్యారెట్ల బంగారంలో 24 భాగాల్లో రెండు బాగాలు ఇతర పదార్థాలు వెండి లేదా జింక్ వంటివి ఉంటాయి.
3.ట్యాంపర్ ఫ్రూఫ్ ప్యాకింగ్..
మోసం, నకిలీల బారిన పడకుండా.. బంగారు నాణెం కొనుగోలు చేసే ముందు ఎలాంటి చిరిగిపోని ప్యాకింగ్ ఉండేలా చూసుకోవాలి. ఈ ప్యాకింగ్ అనేది బంగారం స్వచ్ఛతకు ప్రామాణికం. భవిష్యత్తులో నాణెం విక్రయించాలనుకుంటే దానిని తెరవకూడదు. ప్యాకింగ్‌ను తెరిస్తే.. ఉత్తమమైన ధరను పొందలేరు.
4. తయారీ రుసుములు..
స్వచ్ఛమైన, కనీస బరువు కలిగిన బంగారు నాణెంపై 8-16 శాతం మధ్య నామమాత్రపు రుసుములు మాత్రమే ఉంటాయి. సాధారణంగా నాణేలు 0.5 గ్రాముల నుంచి 50 గ్రాముల బరువు పరిమాణంలో లభిస్తాయి.
5. అమ్మకానికి వీలుగా..
బ్యాంకుల నుంచి బంగారు నాణేలను కొనుగోలు చేస్తే ఆర్బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులు తిరిగి కొనుగోలు చేయవని గుర్తుంచుకోవాలి. ఒకవేళ నాణేలను మరో జువెలర్స్‌కి విక్రయించాలనుకున్నప్పుడు.. కొనుగోలు చేసినదానికన్నా తక్కువ ధర వస్తుంది. మార్కెట్ రేటు ప్రకారం.. ఎలాంటి తయారీ రుసుములు, ఇతర ఛార్జీలు లేకుండా ఇస్తారు.
6. ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలి..?
బంగారు నాణేలను దేశంలోని వివిధ ఆర్థిక సంస్థలు విక్రయిస్తున్నాయి. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ సంస్థలైన ముథూట్ ఫైనాన్స్, ఎంఎంటీసీ, ఎస్‌హెచ్‌సీఐఎల్, అమెజాన్.ఇన్ వంటి ఆన్లైన్ రిటైలర్లు వద్ద నుంచి నాణేలు కొనుగోలు చేయొచ్చు.
ఇదీ చూడండి: చెన్నై-టోక్యో విమానసేవలు ప్రారంభించిన ఏఎన్ఏ