ఈ ఏడాది చివరి నాటికి దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చని అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్పర్సన్ శోభనా కామినేని అభిప్రాయపడ్డారు. కొవిడ్- 19 వ్యాక్సిన్ పంపిణీకి అపోలో సన్నద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ మేరకు జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా త్వరలో కొవిడ్- 19 వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, భారత్ వంటి అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో వ్యాక్సిన్ సరఫరా అనేది కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
వ్యాక్సిన్ సరఫరాకు ప్రభుత్వానికి సహరించేందుకు అపోలో సన్నద్ధంగా ఉందన్న శోభనా కామినేని... ఏటా ౩౦౦ మిలియన్ల డోస్‌లు సురక్షితంగా ప్రజలకు అందించే కోల్డ్‌చైన్ తమకు ఉందన్నారు. 10 వేల మంది అపోలో నిపుణులు సైతం వ్యాక్సిన్‌ని సురక్షితంగా అందించేందుకు శిక్షణ పొందుతున్నారని వెల్లడించారు.
కరోనా వ్యాక్సిన్ అతి తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. మానవ శరీరంలో వ్యాక్సిన్ ఏడాది వరకు సమర్థంగా పనిచేసే అవకాశం ఉందని, ఆ తర్వాత బూస్టర్ డోస్‌లు అవసరం పడవచ్చని తెలిపారు.
ఇదీ చూడండి: ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ