వచ్చే ఏడాది ఉద్యోగాలొస్తాయని, వేతనాలు పెరుగుతాయనే ఆశావాదం.. ఆసియా-పసిఫిక్ దేశాల్లో భారతీయుల్లోనే ఎక్కువగా ఉందని జాబ్ సైట్ 'ఇండీడ్' గ్లోబల్ అధ్యయనం వెల్లడించింది. భారతీయ ఉద్యోగులు (56 శాతం) ప్రతి ఇద్దరిలో ఒకరు 2021లో తమ వేతనాలు పెరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియాలో 20 శాతం, సింగపూర్‌లో 23 శాతం మంది మాత్రమే వేతన పెంపుపై ఆశావాహంగా ఉన్నారు.
భారత్‌తో పాటు యూకే, యూఎస్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, ఇటలీ, సింగపూర్, మెక్సికో, బ్రెజిల్, కెనడాల్లో గత నెల 13-20 తేదీల మధ్య ఇండీడ్ జాబ్ సైట్ గ్లోబల్ సర్వే నిర్వహించింది. 3,600 మంది ఉద్యోగ సంస్థలు, 14,142 మంది ఉద్యోగుల్ని సర్వే చేసి అధ్యయన వివరాలను వెల్లడించింది.
అందులోని ప్రధాన అంశాలు..
- కెరీర్ అవకాశాలు 2021లో బాగుంటాయని ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ వస్తోందనే వార్తలే ఈ సానుకూల ధోరణికి కారణమని సర్వే తెలిపింది.
- ఉద్యోగ భద్రతపై 59 శాతం మంది, ఉద్యోగుల శ్రేయస్సుపై 44 శాతం మంది నమ్మకంగా ఉన్నారు.
- ఇతర కంపెనీల్లో ఉద్యోగావకాశాలు వచ్చినా వెళ్లేందుకు సిద్ధంగా లేమని 54 శాతం మంది తెలిపారు. ప్రస్తుతం పని చేస్తున్న కార్యాలయంలో సంతృప్తిగా ఉండటం ఒకటైతే, కొత్త సంస్థలో ఉద్యోగ భద్రత ఎలా ఉంటుందనే అనుమానం మరొక కారణంగా వెల్లడించారు.
- కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వ్యాపారం కొనసాగింపు కోసం సంస్థలు తీసుకున్న నిర్ణయాలు చాలా బాగున్నాయని ప్రతి ఐదుగురిలో ఇద్దరు ఉద్యోగులు వెల్లడించారు.
- సంక్షోభ సమయంలో తమ సంస్థతో కలిసి అడుగులు వేసేందుకు ముందుకొచ్చామని 66 శాతం మంది ఉద్యోగులు పేర్కొన్నారు.
- కుటుంబంతో గడపడానికి అధిక సమయం దొరికిందని, ఇంటి నుంచి పని చేసేందుకు ఎక్కువ అవకాశాలు కలిగాయని ప్రతి ఐదుగురిలో ఇద్దరు వెల్లడించారు.
ఇదీ చదవండి:ధరల పెంపు బాటలో వాహన తయారీ సంస్థలు