రైలు టికెట్లను బుక్ చేసుకొనే సౌకర్యాన్ని అమెజాన్ ఇండియా అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఐఆర్సీటీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. తొలిసారి టికెట్ల బుకింగ్‌పై అమెజాన్ వినియోగదార్లకు 10శాతం నగదు డిస్కౌంట్ కూడా లభించనుంది. ఈ రాయితీ అత్యధికంగా 100 రూపాయల వరకు ఉంటుంది. ప్రైమ్ సభ్యులకు 12శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఇది అత్యధికంగా 120 రూపాయల వరకు ఉంటుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే వర్తిస్తుందని సంస్థ పేర్కొంది.
కొంతకాలం పాటు అమెజాన్ డాట్ ఇన్.. సర్వీస్, పేమెంట్ గేట్‌వే ఛార్జీలను కూడా రద్దు చేసింది. ఈ కొత్త సేవలతో 'అమెజాన్ పే'తో విమాన, బస్సు టికెట్లతోపాటు రైలు టికెట్లు కూడా బుక్ చేసుకొనే అవకాశం లభించింది.
అమెజాన్ యాప్‌లో వినియోగదారులు రైళ్లలో సీట్ల లభ్యతను చెక్ చేసుకోవచ్చు. పీఎన్‌ఆర్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అమెజాన్ నుంచి బుక్ చేసుకొన్న టికెట్లను డౌన్‌లోడు చేసుకోవడం, రద్దు చేసుకోవడం వంటివి కూడా సాధ్యమవుతాయి. ఈ సరికొత్త సేవలు అమెజాన్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లలో లభించనున్నాయి.
గత ఏడాదే విమాన, బస్సు టికెట్ల బుకింగ్‌ను అమెజాన్ ప్రారంభించింది.
ఇదీ చూడండి:- ఐఆర్సీటీసీలో 15-20 శాతం వాటా విక్రయం!