కరోనా వ్యాప్తి, లాక్డౌన్ నిబంధనలతో దేశవ్యాప్తంగా ఇటీవల మద్యం హోం డెలివరీకి డిమాండ్ పెరిగింది. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సంస్థలు దీనిని అందిపుచ్చుకుని.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ తరహా సేవలు అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం 'అమెజాన్' మద్యం హోం డెలివరీ సేవలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు అమెజాన్‌కు బంగాల్ ప్రభుత్వం నుంచి అనుమతులు లభించినట్లు సమాచారం.
ఎప్పటి నుంచో భారత్‌లో మద్యం హోం డెలివరీ సేవల అనుమతి కోసం ప్రయత్నిస్తున్న అమెజాన్‌కు.. దీనితో మార్గం సుగమమైంది.
బిగ్బాస్కెట్కూ అనుమతులు!
అమెజాన్‌తో పాటు నిత్యావసరాల హోం డెలివరీ సంస్థ బిగ్ బాస్కెట్కూ మద్యం అమ్మకాలకు బంగాల్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తయితే త్వరలోనే అమెజాన్, బిగ్‌బాస్కెట్‌లు మద్యం హోం డెలివరీలు ప్రారంభించే అవకాశాలున్నాయి.
ఇప్పటికే ఝార్ఖండ్, ఒడిశా, బంగాల్లో స్విగ్గీ, జొమాటో మద్యం హోం డెలివరీ సేవలు అందిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు ఈ తరహా సేవలు అందించేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి.