ఆస్ట్రేలియాలోని కార్మిఖేల్ గని నుంచి బొగ్గు తవ్వకాలను అదానీ గ్రూప్(adani group) గురువారం ప్రారంభించింది. అనుకున్న సమయానికే వినియోగదార్లకు బొగ్గును ఎగుమతి చేయడం ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్టుతో ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలగడమే కాకుండా.. భారతీయ విద్యుత్ ప్రాజెక్టులకు తక్కువ ధరకే బొగ్గు అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టుకు పలు వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురవ్వడమే కాకుండా..రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకు రాలేదనే విషయం తెలిసిందే. ఈ అవరోధాలన్నింటినీ అధిగమిస్తూ.. ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు అదానీ గ్రూపు శ్రమించింది.
క్వీన్స్‌ల్యాండ్‌కు 300 కి.మీల దూరంలో ఉన్న ఈ గనిని ఆస్ట్రేలియాలోని ఓ పోర్టుకు అనుసంధానం చేస్తూ కొత్త రైల్వే లైన్ కూడా నిర్మించారు. 16.5 బిలియన్ ఆస్ట్రేలియా డాలర్ల పెట్టుబడి అంచనాతో 2010లో ఈ ప్రాజెక్టుకు అదానీ గ్రూపు ప్రణాళిక రూపొందించుకుంది. ఆ తర్వాత దీనిని 2 ఆస్ట్రేలియా బిలియన్ డాలర్లకు తగ్గించుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రారంభంలో ఏడాదికి 15 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కానుంది. అనంతరం ఉత్పత్తి సామర్థ్యాన్ని 27.5 మిలియన్ టన్నులకు పెంచుకోవాలని అదానీ గ్రూపు భావిస్తోంది. ఈ ఏడాదిలోనే బొగ్గు ఎగుమతులను ప్రారంభించేందుకూ సిద్ధమవుతుంది. కార్మిఖేల్ గనికి మొదటి వినియోగదారు భారతేనని సంస్థ ఉన్నతాధికారి తెలిపారు. ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గును ఎగుమతి చేసేందుకు భారత్ రూపంలో ఓ విపణిని ఇప్పటికే ఈ గని దక్కించుకుందని తెలిపారు. సూచీల ధరల ఆధారంగానే బొగ్గు విక్రయిస్తామని.. పన్నులు, రాయల్టీలను ఆస్ట్రేలియాలోనే చెల్లిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : రూ.75వేల కోట్లతో రిలయన్స్ 'హరిత వెలుగులు'!