కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 12,000 టన్నుల ఉల్లి దిగుమతి చేసుకున్నట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాసవాన్ తెలిపారు. ఆ సరుకును రాష్ట్రాలకు రూ.49-రూ.58 మధ్య విక్రయించడానికి సరఫరా చేసినట్లు వెల్లడించారు.
దిగుమతి చేసుకున్న ఉల్లిలో 1,000 టన్నులను దిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు పాసవాన్ తెలిపారు. అదనంగా దిగుమతి చేసుకుంటున్న 36,000 టన్నుల ఉల్లి జనవరి చివరినాటికి స్వదేశానికి చేరుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. దీంతో ధరలు మరింత తగ్గుముఖం పడతాయని అన్నారు.
దారికొస్తున్న ఉల్లి ధరలు
దేశంలో ఉన్న ఉల్లి డిమాండ్ సహా ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో విదేశాల నుంచి కేంద్రం ఉల్లి దిగుమతి చేస్తోంది. గత రెండు నెలలుగా పలు ప్రధాన నగరాల్లో రూ.100కు పైగా పలికిన ఉల్లి ధర ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. 2019 డిసెంబర్ 19న దేశ రాజధాని దిల్లీలో రూ.118గా ఉన్న కేజీ ఉల్లి ధర ప్రస్తుతం రూ.70 పలుకుతోంది. ఇదే సమయంలో ముంబయిలో రూ.120 నుంచి రూ.80కి చేరినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో ఉత్పత్తి 25 శాతం తగ్గినందున దేశంలో ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి.