సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచీ వివాదాల నిలయంగా మారింది చంద్రగిరి నియోజకవర్గం. ఇక్కడ ప్రలోభాలకు తక్కువేమి కాదు. వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఆరోపణలు పెద్ద ఎత్తున రావడమే కాదు...పోలీసు తనిఖీల్లోనూ ఆయన చిత్రపటంతో ఉన్న గోడ గడియారాలు, మిఠాయి పెట్టెలు పట్టుబడ్డాయి. ఈనెల 19న రీపోలింగ్ జరిగే కొత్తకండ్రిగ పోలింగ్ కేంద్రం పరిధిలోని గణేషపురం ఎస్టీ కాలనీలో... ఓటుకు 6 వేలు పంచేందుకు యత్నించి వైకాపా కార్యకర్తలు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.
ఓటర్లకు షిర్డీ యాత్ర...
ప్రలోభాల పర్వంలో ఇప్పటి వరకూ చేసిన ప్రయత్నాలను తలదన్నేలా వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి కొత్త ఎత్తులకు తెరతీశారు. ఓటర్లను విహార యాత్రకు పంపారు. ఓటర్ల కోసం ప్రత్యేకంగా ఓ రైలు ఏర్పాటు చేసి షిర్డీ యాత్రకు తరలించారు. గురువారం ఉదయం చంద్రగిరి రైల్వేస్టేషన్‌లో 23 బోగీలతో బయలుదేరిన రైలు... షిర్డీ యాత్ర ముగించుకొని 19 తేదీ ఉదయం తిరిగి చంద్రగిరి రానుంది.
బండి బండి రైలూ బండీ...
ఒక్కో బోగీకి 72 మందిని చొప్పున.. మొత్తం 1750 మందిని యాత్రకు తరలించారు. యాత్ర పొడవునా వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లను వైకాపా నేతలు సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది. షిర్డీ యాత్రకు వెళ్లిన వారిలో కొందరు రైలులో విశ్వరూపం చూపించారు. వెంట తెచ్చుకున్న మద్యం సీసాలు, పేకలు బయటకు తీశారు. రేణిగుంట స్టేషన్‌లో రైలు ఆగిన సమయంలో పరుగెత్తుకుంటూ వెళ్లి మద్యం సీసాలు తెచ్చుకొన్నారు. రీపోలింగ్ కేంద్రాల్లో ఎక్కువ శాతం తెదేపాకు అనుకూలంగా ఓట్ల పడతాయనే భావనతోనే వైకాపా నేతలు.. వీలైనన్ని మార్గాల్లో ప్రలోభాల వల విసురుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
ఇదీ చదవండి: ఆ అయిదు కేంద్రాల్లో ఎంతమంది ఓటర్లంటే?