ఎస్టీ జనరల్ స్థానంగా రిజర్వ్ అయిన ఆదిలాబాద్ జిల్లాలో 17 మండలాలు ఉన్నాయి. జిల్లా పరిషత్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ... తెరాస అన్ని విధాలా ప్రయత్నం చేసింది. బోథ్ నియోజకవర్గంలోని నేరడిగొండ జడ్పీటీసీ సభ్యుడిగా అనిల్ జాదవ్ , ఆసిఫాబాద్ నియోజకవర్గం పరిధిలోని నార్నూర్ జడ్పీటీసీ సభ్యుడిగా రాఠోడ్ జనార్దన్ విజయం సాధించారు. వీరిలో ఎవరో ఒకరికి జడ్పీ ఛైర్మన్ ఇవ్వడం ఖాయమని భావిస్తున్న తరుణంలో... బోథ్ నియోజకవర్గంలోని భీంపూర్ జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచిన కుమ్ర సుధాకర్ పేరు తెరపైకి రావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆదివాసీ కావడం ..
రాఠోడ్ జనార్దన్, అనిల్ జాదవ్ లంబాడీ తెగకు చెందిన నేతలు కావడం..., సుధాకర్ ఆదివాసీ తెగకు చెందిన అభ్యర్థి కావడం కీలకంగా మారింది. జిల్లాలో ఖానాపూర్, బోథ్ ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాఠోడ్ బాపురావు లంబాడీ తెగకు చెందిన నేతలే కావడం వల్ల జడ్పీ ఛైర్మన్‌గా ఆదివాసీ తెగకు చెందిన కుమ్ర సుధాకర్‌కు ఇవ్వాలనే వాదన పార్టీలో వినిపిస్తోంది.
మధ్యే మార్గంగా...
జిల్లా పరిషత్ పీఠం కైవసానికి సరిపడ ... తెరాసస తొమ్మిది స్థానాలను గెల్చుకుంది. మరో అయిదు చోట్ల భాజపా, మూడు చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. తెరాసలో రెండు వర్గాలుగా ఉన్నందున... కాంగ్రెస్, భాజపా కూటమి చాపకింద నీటిలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అనిల్ జాదవ్, రాఠోడ్ జనార్దన్లలో ఎవరో ఒకరి పేరు ప్రతిపాదిస్తే మరో వర్గానికి గిట్టే పరిస్థితి లేదు. మధ్యే మార్గంగా కుమ్ర సుధాకర్‌కు జడ్పీ పదవి కట్టబెడితే పార్టీకి దూరమైన ఆదివాసీల మనసూ చూరగొన్నట్లు అవుతుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఆ ముగ్గురిలో... ఎవరు?
జడ్పీ ఛైర్మన్ అభ్యర్థి ఖరారు బాధ్యతను పార్టీ అధిష్ఠానానికి అప్పగించేందుకు జిల్లా నేతలు మొగ్గు చూపుతుండటం సమస్య తీవ్రతను తెలియజేస్తుంది. ఇక ఈ ముగ్గురిలో అధిష్ఠానం ఎవరికి జడ్పీ పీఠం కట్టబెడుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇదీ చూడండి : కారెక్కిన కాంగ్రెస్...? హోదా గల్లంతు..!