దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం ఐదు. నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహా శివరాత్రి, యోగ శివరాత్రి. వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహా శివరాత్రి. మార్గశిర మాసంలో బహుళ చతుర్థి, అర్ధ నక్షత్రం రోజున లింగోద్భవం జరిగింది.
పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్న పక్షాన్ని కృష్ణపక్షం అంటాం. ఈ తిథులలో ఒక్కో రోజూ గడిచే కొద్దీ చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు. తద్వారా మనుషుల ఆలోచనా తీరు, వారిలోని ఉత్సాహం అమావాస్య నాటికి మందగిస్తాయి. ఇలాంటి సమయంలో దేవుడిపై మనసుని లగ్నం చేయడం వల్ల నిస్తేజంగా ఉన్న మనసు ఉత్తేజితం అవుతుంది. మర్నాడు అమావాస్య కూడా ఉత్సాహంగా సాగిపోతుంది.
శివరాత్రి నాటికి చలి, శివశివా అంటూ వెళ్లిపోతుందంటారు పెద్దలు. రథ సప్తమి నాటికి మొదలయ్యే సూర్యకిరణాల క్షీణత మరుసటి వారం నాటి శివరాత్రికి వేడి నందుకుంటాయి. ఈ సమయంలో చలి, వేడి ఒకేస్థాయిలో ఉంటాయి. ఎండకాలం ఉపవాసం ఉండటం కష్టమే. మరి చలికాలంలో జాగరణ చేయడం సాధ్యం కాదు. ఈ రెండూ ఇష్టంగా చేసేందుకు వాతావరణం అనుకూలించాలి. అందుకే సమశీతోష్ణ స్థితి ఉండేది మహాశివరాత్రినాడే.
శరీరానికి ఆహారాన్ని అందిస్తున్నంతసేపూ.. అది సుఖంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనస్సు కూడా నిస్తేజంగా ఉంటుంది. ఒక్కరోజు శరీరానికి ఆహారం అందించకపోతే... నేనంటూ ఉన్నానంటూ అది మనకి గుర్తుచేస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఏమిటి అని మనసు విచారణ సాగిస్తుంది. ఉపవాస జాగరణలతో శరీరం, మనసు రెండూ మెలకువతో ఉంటాయి.
ఈ శివరాత్రికి మనమూ మన మనస్సును ఉత్తేజపరిచి.. జీవితాన్ని ఆనందంగా గడుపుదాం.