వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సన్నద్ధం చేశారు. ఈ ఎన్నికలో తెరాస నుంచి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ తరఫున ఇనగాల వెంకట్రాంరెడ్డి మరో ముగ్గురు స్వతంత్రులతో కలిపి మొత్తం ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెరాస, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉండనుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, వరంగల్ నగర పాలక సంస్థ కార్పొరేటర్లు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నర్సంపేట, జనగామ, పరకాల మున్సిపల్ కౌన్సిలర్లు, ఆయా స్థానిక సంస్థలలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులు ఓటు వేయనున్నారు.
అధికార పక్షమైన తెరాసకు సంఖ్యాపరంగా బలం ఉంది. మొత్తం 902 మంది ఓటర్లలో 677 మంది సభ్యుల మద్దతు తెరాసకు ఉండటం వల్ల గెలుపుపై ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రలోభ పెట్టే అవకాశాలున్నాయంటూ ముందు జాగ్రత్తగా... గులాబీ నేతలు తమ సభ్యులను వేసవి విడిది పేరుతో ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు క్యాంపులకు తరలించారు. వీరంతా పోలింగ్‌కు ఒక్క రోజు ముందు నగరానికి రానున్నారు.
ఓటర్లందరికి గుర్తింపు కార్డులు జారీ చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ నెల 31న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిబంధనలను పూర్తిగా పాటిస్తూ... నిష్పక్షపాతంగా పోలింగ్ విధులు నిర్వహించాలని అధికారులను ఆర్వో ఆదేశించారు.
ఇదీ చూడండి : మోదీ ప్రమాణ స్వీకారానికి బిమ్స్టెక్ దేశాధినేతలు!