అమ్మను మించిన దైవమున్నదా.. అంటూ మాతృమూర్తి గొప్పతనాన్ని వర్ణించాడో రచయిత. పేగు తెంచుకు పుట్టే బిడ్డ మీద తల్లి ఎక్కడలేని మమకారాన్ని పెంచుకుంటుంది. బిడ్డ అనారోగ్యంతో బాధపడుతుంటే మాతృమూర్తి వేదన మాటల్లో చెప్పలేం. చిన్నారులను మామూలు మనుషులను చేయాలని అనునిత్యం తపిస్తుంటారు. అలాంటి వారి కోసం ఓ తల్లి ఏర్పాటు చేసిన రీహాబిలిటేషన్ కేంద్రమే... పినాకిల్ బ్లూమ్స్. మానసిక ఎదుగుదల లేని పిల్లల కోసం పనిచేస్తూనే.. నిరుపేదలకూ ఉచితంగా థెరపీలను అందిస్తోంది పినాకిల్ బ్లూమ్స్.
ఆటిజం పిల్లల కోసం..
హైదరాబాద్కు చెందిన శైలజా సిరిపల్లి తన ఐదేళ్ల కుమారుడిలో ఏదో లోపం ఉందని గుర్తించింది. బిడ్డ ఆరోగ్యాన్ని మూమూలు స్థితికి తేవాలనుకుంది. అమ్మా అని పిలిపించుకోవాలని ఎంతగానో తపించినా.. లాభం లేకపోయింది. ఆటిజం పిల్లల కోసం పినాకిల్ బ్లూమ్స్ సంస్థని స్థాపించింది. దీని ద్వారా పిల్లల్లో మార్పు తీసుకువచ్చి... సాధారణ జీవితాన్ని గడిపేలా ప్రోత్సహిస్తోంది. అత్యంత ఖరీదైన ఇలాంటి థెరపీలు చేయించలేక బాధపడుతున్న తల్లిదండ్రులకూ సేవా ఫౌండేషన్ ద్వారా ఉచితంగానే ఈ సేవలను అందిస్తోంది.
ఏడు శాఖలు..
పినాకిల్ బ్లూమ్స్కు ఏడు శాఖలున్నాయి. ప్రతి శాఖలో ఆటిజం పిల్లలకి రోజూ నలబై ఐదు నిమిషాలు శిక్షణ ఇస్తారు. వైద్యుల సహాయంతో మాట్లాడే, ప్రవర్తన థెరపీ సహా వివిధ రకాల క్రీడలను పిల్లలకు పరిచయం చేస్తున్నారు. ఫలితంగా చిన్నారులు పినాకిల్కు వచ్చిన రెండు మూడు నెలల్లోనే మెరుగ్గా కనిపిస్తున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఎందరికో ఆదర్శం..
ప్రపంచ వ్యాప్తంగా సుమారు పది కోట్ల మంది చిన్నారులు ఆటిజంతో బాధపడుతుండగా.. ఒక్క భారత్లోనే కోటి మందికి పైగా ఉన్నారు. నిత్యం వివిధ రకాల వ్యాధులతో సతమతమయ్యే ఇలాంటి పిల్లలకు పినాకిల్ నిజంగా చక్కని పరిష్కారం. ఆటిజం ఉన్న పిల్లలతో తల్లిదండ్రులు పడే మానసిక వేదన అంతా ఇంత కాదు. అలాంటి వారి ముఖాల్లో చిరునవ్వుతో పాటు మంచి భవిష్యత్తు అందించాలన్నదే పినాకిల్ ధ్యేయమంటున్న శైలజ మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇవీ చూడండి: అమ్మ ఒక మజిలీ కాదు... జీవిత ప్రయాణం