జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కలుగొట్ల గ్రామంలో మహిళలకు 15 రోజులుగా నాబార్డు ఆధ్వర్యంలో మిరాకిల్ సోషల్ సర్వీసెస్ సొసైటీ ఉచిత శిక్షణా కార్యక్రమాలు చేపట్టింది. ఈ సంస్థ ఒక గ్రామాన్ని ఎన్నుకొని పొదుపు మహిళా సంఘాల్లోని ఉత్సాహవంతమైన సభ్యులకు శిక్షణ ఇస్తోంది. డైనింగ్ టేబుల్ మ్యాట్లు, గోడ అలంకరణ వస్తువులు, హ్యాండ్, మార్కెటింగ్ బ్యాగులు, టీ కప్ మ్యాట్లు, గృహోపకరణాల వస్తువుల తయారీపై శిక్షణ ఇస్తున్నారు. జనపనార సహాయంతో తయారీ విధానం నేర్పిస్తున్నారు.
రోజుకు రూ. 200-300..
శిక్షణ పొందిన మహిళలు ఆర్థికంగా బలపడడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటూ... ఇంట్లోనే రోజుకు 200 నుంచి 300 రూపాయల ఆదాయం పొందొచ్చు. వస్తువులు తయారీ నేర్చుకున్న మహిళలకు ముడిసరుకు అందించి తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేయడానికి గుర్తింపు కార్డులు కూడా ఇస్తున్నారు. తర్ఫీదు పొందిన మహిళలకు రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. గుర్తింపు కార్డు ఉన్నవారికి 60 ఏళ్లు దాటిన తర్వాత మూడు వేల రూపాయలు పింఛను ఇస్తున్నారు.
ప్రత్యేక శిక్షకురాలి ఆధ్వర్యంలో..
శ్రీకాకుళం నుంచి ప్రత్యేకంగా వచ్చిన శిక్షకురాలు మహిళలకు వస్తువుల తయారీపై తర్ఫీదు ఇస్తున్నారు. జనపనార ఉపయోగించి వస్తువులను తయారు చేయడం వల్ల మహిళలకు ఆదాయం సమకూర్చడమే కాకుండా.. పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆమె తెలిపారు. తమ గ్రామంలో నాబార్డ్ సంస్థ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం చాలా సంతోషంగా ఉందని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ గృహోపకరణాల వస్తువుల తయారీని తాము ఎంతో ఇష్టంగా నేర్చుకుంటున్నామని చెబుతున్నారు.
ఇవీ చూడండి: కార్వాన్ పేపర్ గోదాములో అగ్ని ప్రమాదం