ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికల కోసం సర్వం సిద్ధమైంది. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లోని 26 జడ్పీటీసీ స్థానాలు, 287 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఐదు జిల్లాల్లోని 26 మండలాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా సుమారు 7 లక్షల 82వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 1,229 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు 12వేల మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. పోలీసు శాఖ అధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ..
150కి పైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన అధికారులు అక్కడ అదనపు బలగాలను మోహరించారు. వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా పోలింగ్ సరళిని ఎప్పటికప్పడు పర్యవేక్షించనున్నారు. ఓటర్ల కోసం ప్రతి పోలింగ్ కేంద్రంలో మంచినీరు, మరుగుదొడ్లు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న చోట షామియానాలు, వైద్యం కోసం శిబిరాలు అందుబాటులో ఉంచనున్నారు.
గుర్తింపు కార్డు తప్పనిసరి..
ఈసారి ఓటు వేసేందుకు ఓటరు స్లిప్పుతో పాటు ఎన్నికల కమిషన్ గుర్తించిన ఏదైనా గుర్తింపు కార్డును తప్పకుండా పోలింగ్ కేంద్రాలకు తీసుకురావాలని అధికారులు ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. రెండో విడతలో ఎన్నికలు జరగాల్సిన ఉట్కూరు మండలంలోని కొల్లూరు, అయిజ మండలంలోని ఎక్లాస్ పూర్, మల్దకల్ మండలంలోని ఎల్కూరు-1 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
ఇవీ చూడండి: చిక్కుల్లో రవిప్రకాశ్.. టీవీ9 సీఈవోగా తొలగింపు