ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీలు నిర్వహించే రోడ్ షో, బైక్ ర్యాలీలపై నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వాటి నిర్వహణలో ఎన్నికల సంఘం నిబంధనలను పార్టీలు ఏ మాత్రం పాటించడం లేదని, అంతేకాకుండా పర్యావరణానికి సైతం నష్టం కలిగిస్తున్నాయని వ్యాజ్యంలో పిటిషనర్లు పేర్కొన్నారు.
అత్యవసరంగా విచారించాలని కోర్టును అభ్యర్థించారు వ్యాజ్యాన్ని దాఖలు చేసిన ఉత్తర ప్రదేశ్ మాజీ డీజీపీ విక్రమ్ సింగ్, పర్యావరణ వేత్త శైవిక అగర్వాల్. విచారణకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం స్వీకరించింది. అయితే అత్యవసర విచారణను తిరస్కరించింది.
నిబంధనల ఉల్లంఘన
"ఎన్నికల సంఘం నిర్ణయించిన దాని ప్రకారం ప్రచారంలో పదికి మించి వాహనాలను వాడకూడదు. వాటన్నింటికి అనుమతులు తప్పనిసరి. రెండు వాహన శ్రేణుల మధ్య కనీసంగా 200 మీటర్ల దూరం ఉండాలి. సగానికి కన్నా ఎక్కువగా రహదారిని ఆక్రమించకూడదు. వీటిని రాజకీయ పార్టీలు ఉల్లంఘిస్తూ వాయు, ధ్వని కాలుష్యానికి కారణమవుతున్నాయి."
- విరాజ్ గుప్తా, పిటిషనర్ల తరఫు న్యాయవాది
రోడ్ షోల్లో వాడే వాహనాలను నాయకులు ఎక్కువ ఖర్చు పెట్టి విలాసవంతంగా తీర్చిదిద్దుకుంటున్నారని, వీటి ఖర్చును లెక్కేస్తే ఎన్నికల సంఘం నిర్ణయించిన పరిమితి దాటిపోతుందని వ్యాజ్యంలో వివరించారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహంచే రోడ్షోలపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంటుందని, ఇది మరింత నష్టమని సుప్రీంకు విన్నవించారు పిటిషనర్లు.
ఇదీ చూడండి:'గౌరవం'పై మాటల మంటలు