బాహ్య వలయ రహదారిపై వాహనదారులు వంద కిలో మీటర్లకు పైగా వేగంతో ప్రయాణిస్తున్నారని రవాణాశాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సచివాలయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన ఐదో సేఫ్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. రోడ్డు భద్రతపై జరిగిన ఈ భేటీలో రోడ్లు భవనాలు, రవాణాశాఖ, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. జాతీయ రహదారులు రోడ్డు భద్రతా విషయంలో ఏబీసీ కేటగిరీలుగా విభజించామని మంత్రి స్పష్టం చేశారు. ప్రమాదాలు జరిగే 173 స్పాట్లను గుర్తించామని వాటి నివారణకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
పీపీపీ కాంట్రాక్టులు ఉన్న వారికి ప్రతి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఒక అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలని ప్రశాంత్ రెడ్డి సూచించారు. ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలానికి చేరుకునే సమయం.. ఆసుపత్రికి చేర్చడానికి పట్టే సమయం తదితర అంశాలపై నివేదిక తయారు చేస్తామన్నారు. అద్దంకి-నార్కట్ పల్లి మార్గంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని.. వాటిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు లారీ, ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తామన్నారు. వేగంగా, హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వాహనం నడిపిన 11 వేల మంది లైసెన్స్‌లు రద్దు చేసి.. కౌన్సిలింగ్ కూడా ఇచ్చామని మంత్రి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : పొట్ట కూటికోసం పోయి... పోలీసుల చెరలో చిక్కారు